
అంతర్జాతీయంగా సుప్రసిద్ధ ద్విచక్ర మరియు మూడు చక్రాల వాహన తయారీదారు టీవీఎస్ మోటార్ కంపెనీ నేడు తమ ప్రత్యేక సేవా మద్దతు కార్యక్రమాన్ని వరదల వల్ల ప్రభావితమైన తెలంగాణా రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు చుట్టు పక్కల ప్రాంత ప్రజల కోసం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని కంపెనీ యొక్క ‘వినియోగదారులే ముందు’ నిబద్ధతకు అనుగుణంగా తమ వినియోగదారుల రవాణా మరియు వారి భద్రత అవసరాలను, వరదల వల్ల ప్రభావితమైన వాహనాల మరమ్మత్తుల అవసరాలను తీర్చేరీతిలో చేపట్టారు.
వీలైనంత త్వరగా ప్రజలు తమ సాధారణ జీవితం ఆరంభించే ప్రయత్నాలలో తోడ్పాటునందించడంలో భాగంగా టీవీఎస్ మోటార్ కంపెనీ , 17 మంది డీలర్లతో భాగస్వామ్యం చేసుకుని ‘ఉచిత సేవా శిబిరం’ను అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4,2020 వ తేదీ వరకూ టీవీఎస్ మోటార్ ద్విచక్రవాహనాల కోసం ఏర్పాటుచేసింది. ఈ సేవలలో భాగంగా వరదల వల్ల వాహనానికి ఏమైనా నష్టం జరిగిందేమో చూడటానికి క్షుణ్ణంగా మరియు సమగ్రంగా వాహనాలను తనిఖీ చేయడం మరియు తక్షణమే మరమ్మత్తులు చేయడం చేస్తారు. ఈ కంపెనీ ఇప్పుడు పలు భీమా కంపెనీలతో సైతం భాగస్వామ్యం చేసుకుని వేగంగా భీమా క్లెయిమ్‌లు పరిష్కరించేందుకు భరోసా కలిగిస్తుంది. భీమా లేని వినియోగదారుల కోసం, కంపెనీ ఇప్పుడు లేబర్ చార్జీలను వరదల వల్ల ప్రభావితమైన వాహనాల కోసం వసూలు చేయడం లేదు.
ఇంజిన్‌కు ప్రమాదం జరుగకుండా ఉండేందుకు వరదల వల్ల ప్రభావితమైన వాహనాల ఇంజిన్‌ను ప్రారంభించవద్దని టీవీఎస్ మోటార్ కంపెనీ తమ వినియోగదారులకు సూచిస్తుంది. ఈ కంపెనీ ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలోని టీవీఎస్ మోటార్ వినియోగదారులందరికీ అసలైన విడిభాగాలు లభించేలా తగిన ప్రణాళికలను చేసింది. తద్వారా క్లిష్టత లేని మరియు వేగవంతమైన సేవా అనుభవాలకు భరోసా అందిస్తుంది. విడిభాగాలు, ఇంజిన్ ఆయిల్ మరియు లూబ్రికెంట్స్ ఖర్చులను వినియోగదారులే చెల్లించాల్సి ఉంటుంది.