‘టైమ్స్’ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఒబామా

Obama‘టైమ్స్’ మ్యాగజైన్ – 2012 ఈ ఏటి మేటి వ్యక్తి (పర్సన్ ఆఫ్ ది ఇయర్)గా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి ఎంపికయ్యారు. ‘నవ అమెరికా నిర్మాత’ అంటూ ‘టైమ్స్’ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ఒబామాను కొనియాడింది. ఈ గౌరవాన్ని అందుకోవడం ఒబామాకి ఇది రెండోసారి. 2008లోనూ టైమ్స్ ఈ ఏటి మేటి వ్యక్తిగా ఆయన నిలిచారు. 2008లో ఒబామా అసాధారణ విజయం సాధించారు. 2012లోనూ అమెరికాలో వచ్చిన జనాభాపరమైన మార్పుల వల్ల ఆ విజయాన్ని తిరిగి నిలబెట్టుకున్నారు’ అని ‘టైమ్స్’ పేర్కొంది. దేశాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒబామా ఒకరని వ్యాఖ్యానించింది. అమెరికా చరిత్రలో ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ తర్వాత వరుసగా రెండో ఎన్నికల్లోనూ 50 శాతం ఓట్లు సాధించిన తొలి డెమోక్రటిక్ గా ఒబామా నిలిచారని కీర్తించింది. దేశంలో 7.5 శాతం నిరుద్యోగం ఉన్న తరుణంలో రెండోసారి అధ్యక్షుడిగా గెలిచిన ఘనత కూడా ఒబామాదేనని పేర్కొంది.

మరోవైపు తాలిబన్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి పాకిస్థాన్ కు చెందిన హక్కుల కార్యకర్త మలాల ‘టైమ్స్’ జాబితాలో రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ఆపిల్ కంపెనీ సీఈ వో టిమ్ కుక్, ఈజిప్టులో ప్రజాస్వామికంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడు ముర్సీ, హిగ్స్ బోసాన్ పరిశోధనలో పాలుపంచుకున్న సెర్న్ చీఫ్ సైంటిస్ట్ ఫాబియోలా గియానొట్టి ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.