రవీంద్రభారతిలో తనికెళ్ళ భరణి కి ఘన సత్కార వేడుక, ప్రత్యేక ఆకర్షణగా రాంగోపాల్ వర్మ, సుద్దాల, పురాణపండ


తనికెళ్ళ భరణి అనగానే సుగంధ తైలంలా సురభిళించే మాటలు పాత్రలై తెరముందు కదలాడి ప్రేక్షకుణ్ణి కట్టేస్తాయి. పండితులకీ, పామరులకీ కూడా తనికెళ్ళ భరణి ‘ ఆటకదరా శివా ‘ అంటే చాలా చాలా ఇష్టమని లక్షలమందికి తెలుసున్న అంశమే.

ఇటీవల వరంగల్ కి చెందిన ఎస్.ఆర్. విశ్వవిద్యాలయం వారి నుండి తనికెళ్ళ భరణి డాక్టరేట్ గౌరవ పట్టాను పుచ్చుకున్న సందర్భంగా సంగమ్ సంస్థ రధ సారధి సంజయ్ కిషోర్ సారధ్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘన సత్కార వేడుక జరిగింది.

ఈ ఆనంద వేడుకలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, శంకరాభరణం ఫేమ్ ప్రముఖ నాట్యకారిణి మంజుభార్గవి , ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్, ప్రముఖ సినీ దర్శకుడు జనార్ధనమహర్షి, ప్రముఖ యాంకర్ ఝాన్సీ , యువ నటుడు బాలాదిత్య తదితరులు పాల్గొని భరణి రచనల , నటనా , వాగ్వైభవంగురించి అద్భుత ప్రసంగాలు చేయడం గమనార్హం.

ప్రముఖ వ్యాఖ్యాత, న్యూస్ ప్రసెంటెర్ స్వప్న స్వాగత వచనాలతో ప్రారంభమైన ఈ వేడుకలో తనికెళ్ళ భరణి గురించి ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంజయ్ కిషోర్ ని వక్తలు, అతిధులు అభినందనలతో ముంచెత్తారు.


ముఖ్య అతిధిగా పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ భరణి మానవ విలువల ఆత్మీయతను , తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు, భరణికి ఎప్పుడో డాక్టరేట్ వచ్చి ఉంటుందని అనుకున్నానని … ఇప్పుడొస్తే తనకి ఆశ్చర్యం కలిగిందని వర్మ పేర్కొన్నారు.


మరొక గౌరవ అతిధి , ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ అనురాగపూరితమైన మంగళ శివ స్పర్శ తనికెళ్ళ భరణిగా అభివర్ణించారు. తనికెళ్ళ భరణి మాటల్లో, ప్రవర్తనలో , రచనల్లో ఆత్మబంధమే కానీ ముసుగులుండవనీ , ఎంతోమందికి ధైర్యం చెప్పి బ్రతుకుల్ని పెంచిన ఆత్మీయతల ఆలంబనగా భరణి దర్శనమిస్తారని పురాణపండ కవిత్వ సౌందర్యంతో స్పష్టంగా చెబుతుండగా ప్రేక్షకుల చప్పట్లు మారు మ్రోగడం విశేషం.


ప్రఖ్యాత నటి మంజు భార్గవి మాట్లాడుతూ … తనికెళ్ళ భరణి మాటలన్నా, ఆయన కవిత్వపు పలుకులన్నా తనకి చాలా ఇష్టమని, సంగమ్ సంస్థ నిర్వ్హయించిన ఎన్నో ఉన్నతమైన ఉత్తమ సభల్లో తానూ , భరణీ కలిసిన ఘటనల్ని పవిత్ర జ్ఞాపకాలుగా చెప్పారు.


ప్రఖ్యాత కవి, రచయిత సుద్దాల అశోక్ తేజ తన మాటల్లో ఈనాటి తన స్థాయి వెనుక ఇరవై సంవత్సరాలుగా తనికెళ్ళ భరణి ప్రోత్సాహం బలంగా ఉందని కొన్ని ఘట్టాల్ని ఆర్ద్రతగా చెప్పారు. భరణి పట్ల సుద్దాలకున్న కృతజ్ఞతను ప్రకటిస్తున్నప్పుడు ఆడియన్స్ చప్పట్ల కొట్టి మరీ తనికెళ్ళ భరణి మంచితనానికి జేజేలు పలికారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు జనార్ధన మహర్షి, ప్రముఖ యాంకర్ ఝాన్సీ , యువ నటుడు, రచయిత బాలాదిత్య , తనికెళ్ళ భరణి తనయుడు మహాతేజ , ప్రముఖ దర్శకులు శివ నాగేశ్వరరావు, పురుషోత్తం రెడ్డి, పెదిరెడ్డి తదితర ప్రముఖులు భరణితో తమకున్న ఆత్మీయ బాంధవ్యాన్ని పంచుకున్నారు.

సన్మానం అందుకున్న భరణి తన ప్రసంగంలో … రారనుకున్న రామ్ గోపాల్ వర్మఈ సభకి వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. అశోక్ తేజ అద్భుతమైన ప్రతిభ ఉన్నవాడు. నేనంటే ఎంతో ఆత్మీయత . ఇరవై ఏళ్ళనాడు నాపై , కోట శ్రీనివాస రావు పై పాట రాసాడు. ఆనాడు అతని ప్రజ్ఞను చూసి ప్రోత్సహించాలనుకున్నాను, ఈనాడు అశోక్ తేజ ఏ స్థాయిలో ఉన్నారో మీకు తెలుసు. పురాణపండ శ్రీనివాస్ కి అరగంట … గంట సరిపోదు . అనర్గళంగా … అద్భుతంగా మాట్లాడగలరు. సముద్రమంత ప్రేమని ఉద్ధరిణిలో పోసి ఈ సన్మానంలో తీర్థంలా అందించారన్నారు భరణి. యాంకర్ ఝాన్సీ నాటకాల వైదుష్యం గురించీ , ఇటీవల ఝాన్సీ రాసిన నాటిక వైభవమ్ గురించి భరణి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేనంటే ఎంతో అభిమానంతో విచ్చేసింది ఝాన్సీ అన్నారు భరణి. నటుడు బాలాదిత్య రాసిన గేయం కి అరవైమంది కళాకారులు గానం చేయడం నన్ను, రామ్ గోపాల్ వర్మతోపాటు అందరినీ ఆకట్టుకుందన్నారు.ప్రముఖ దర్శకుడు జనార్దనమహర్షి తన భార్య కంటే ముందే తన జీవితంలో ప్రవేశించారని … జనార్ధన మహర్షి తన ఇంట్లో మనిషని … తాను ఈ సన్మాన సభలో పాల్గొనడం ఆనందపరిచిందని తనికెళ్ళ భరణి అందరినీ పేరుపేరునా ప్రస్తావిస్తూ చెప్పడం గమనార్హం. తాను నష్టపోయినా సభల్ని నిర్వహించడంలో సంజయ్ కిషోర్ సర్వ సమర్థుడని, చాలా చక్కగా నిర్వహించారని భరణి సంజయ్ కిషోర్ ని అభినందించారు.