T20 World Cup : చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. తొలిసారి ఫైనల్ కు


మహిళల టీ20 ప్రపంచ కప్ లో సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. కీలకమైన మ్యాచ్ లో ఇంగ్లాండ్‌పై 6 రన్స్ తేడాతో విజయం సాధించి తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఓపెనర్లు ఓల్వార్ట్ (53), తంజిమ్ బ్రిట్స్ (68) హాఫ్ సెంచరీలు చేయడంతో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఇక ప్రత్యర్థిని 156/8కే పరిమితం చేసింది. భారీ లక్ష్య చేధనలో ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు డానియెల్లీ వ్యాట్ (30 బంతుల్లో 34), సోఫియా డంక్లీ (16 బంతుల్లో 28) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 5.1 ఓవర్లలోనే 53 పరుగులు జోడించారు. ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్న దశలో ఆరో ఓవర్ బౌలింగ్ చేసిన షబ్నిమ్ ఇస్మాయిల్ ఇంగ్లాండ్‌ను దెబ్బతీసింది. మూడు బంతుల వ్యవధిలో సోఫియా, అలీస్ క్యాప్సీ (0)ను పెవిలియన్‌కు చేర్చింది. ఇక ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. సౌతాఫ్రికా బౌలర్ ఇస్మాయిల్ ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్‌ (25 బంతుల్లో 31)ను బౌల్డ్ చేయడంతో ఇంగ్లిష్ జట్టు ఓటమి ఖాయమైంది. సరైన సమయాల్లో వికెట్లు తీసిన సఫారీ బౌలర్లు జట్టుకు విజయాన్ని అందించారు. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం ఫైనల్ జరగనుంది.