అక్కడ 18 ఏళ్లు దాటితే పెళ్లి చేసుకోవాల్సిందే, లేకుంటే రూ.500 ఫైన్..

పాకిస్థాన్ లో ఒక కొత్త చట్టం అమల్లోకి రానుంది. పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్ర అసెంబ్లీలో ఓ చట్టసభ్యుడు వినూత్న బిల్లును బుధవారం ప్రవేశపెట్టారు. 18 ఏండ్లు నిండిన వారికి వివాహాన్ని తప్పనిసరి చేసేలా చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ బిల్లు ముసాయిదాను అసెంబ్లీలో సమర్పించారు. సమాజంలో అనైతిక కార్యకలాపాలను నిరోధించటమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నామని సదరు నేత అసెంబ్లీకి తెలిపారు. ఈ మేరకు ‘ద సింధ్ కంపల్సరీ మ్యారేజ్ యాక్ట్-2021’ బిల్లు ముసాయిదాను.. సింధ్ అసెంబ్లీ సెక్రటేరియట్కు మత్తాహిదా మజ్లిస్-ఏ-అమల్(ఎమ్ఎమ్ఏ) పార్టీకి చెందిన నేత సయ్యద్ అబ్దుల్ రషీద్ అందజేశారు.

18 ఏండ్లు దాటినవారికి వివాహం చేయని తల్లిందండ్రులు అందుకు గల కారణాన్ని జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎదుట తెలియజేయాలని మసాయిదాలో పేర్కొన్నారు. అలా చేయని వారికి రూ.500ను జరిమానా విధించాలని తెలిపారు.