Site icon TeluguMirchi.com

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు హెచ్చరిక


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రియమైన ఖాతాదారులారా! మీరు మీ కార్డును మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని ఖాతాదారులకు సరికొత్త హెచ్చరికలను జారీ చేసింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఖాతాదారులంతా మాగ్నటిక్‌ స్ట్రిప్‌ డెబిట్‌ కార్డుల స్థానంలో ఈఎంవీ చిప్‌ కలిగిన కొత్త డెబిట్‌ కార్డులను తీసుకోవాలంటోంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ తన ఖాతాదారులను చిప్‌ కార్డులకు మారాల్సిందిగా కోరుతోంది.

మోసపూరిత లావాదేవీల నుంచి ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించేందుకు చిప్‌ ఆధారంగా పనిచేసే డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను ఇవ్వాలని అన్ని బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు బ్యాంకులు సైతం మాగ్నటిక్‌ స్ట్రిప్‌ కార్డుల స్థానంలో ఈఎంవీ కార్డులను ఖాతాదారులకు అందిస్తున్నాయి. గడిచిన జూన్‌ నాటికి 28.9 కోట్లమంది ఖాతాదారులు చిప్‌ ఆధారంగా పనిచేసే ఎటీఎం కమ్‌ డెబిట్‌ కార్డులను పొందారు.

జూన్‌ ఆఖరు నాటికి ఎస్‌బీఐ 28.9 కోట్ల ఏటీఎం-డెబిట్‌ కార్డులు జారీ చేయగా, ఇందులో సింహభాగం చిప్‌ ఆధారిత ఏటీఎం-డెబిట్‌ కార్డులు ఉండగా , డిసెంబర్‌ 31లోపు అందరూ కార్డులు మార్చుకోవాలని ఎస్‌బీఐ చెప్పింది. పాత కార్డులు ఆ తరువాత నుంచి చెల్లవని, కొత్త చిప్‌ డెబిట్‌ కార్డు కోసం హోమ్‌ బ్రాంచీలో సంప్రదించవచ్చని లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్‌బీఐ సూచించింది.

ఈ కార్డులో ఉండే చిప్ ద్వారా.. స్కిమ్మింగ్ మోసాలతో పాటూ ఒకవేళ పొరపాటున కార్డు పోయినా, చోరీ చేసినా, కస్టమర్లు డబ్బుకు రక్షణ ఉండేలా రూపొందించామంటున్నారు అధికారులు. నకిలీ కార్డు మోసాలకు ఆస్కారమివ్వని ఈఎంవీ (యూరోపే, మాస్టర్‌కార్డ్, వీసా) చిప్‌ కార్డులు సురక్షితమైనవని పేర్కొంది. ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియేనని, కొత్త కార్డుల జారీకి ఎటువంటి చార్జీలు ఉండవని ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది.

Exit mobile version