75 వ భారత స్వాతంత్ర్య వార్షికోత్సవం పై ఫోటో ఎగ్జిబిషన్

స్వాతంత్య్రోద్యమంలో సమరయోధుల పాత్రను తెలియజేసే విధంగా, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్.ఒ.బి) హైదరాబాద్, భాషా, సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్ లో 2021 ఏప్రిల్ 9 నుండి 15 వరకు ఒక వారం పాటు భారత స్వాతంత్ర్య 75 సంవత్సరాల వేడుక పై ఫోటో ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తోంది.

దేశ భవిష్యత్తును సురక్షితం చేయడానికి స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాల విలువను పౌరులకు గుర్తు చేయడమే ఈ ఫోటో ఎగ్జిబిషన్ లక్ష్యం. ఈ ఫోటో ఎగ్జిబిషన్ దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ రూపంలో నిర్వహించిన కార్యక్రమాల శ్రేణిలో భాగం. స్వాతంత్ర్య పోరాటం లో భాగంగా మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, సుబాష్ చంద్రబోస్ మరియు ఇతర ప్రముఖ నాయకుల పాత్రకు సంబంధించిన ఛాయాచిత్రాలు ప్రస్తుత యువ తరానికి క్లుప్తంగా చరిత్రను వెల్లడిస్తాయి. స్వాతంత్ర్య పోరాటం లోని వివిధ కీలక అంశాలను ఈ ఫొటో ప్రదర్శన స్పృశిస్తుంది. కఠినమైన బ్రిటిష్ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి మహాత్మా గాంధీ దండి మార్చ్ ఎలా నిర్వహించారో ప్రస్తావిస్తుంది. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి సార్వభౌమ దేశంగా మారే వరకు జరిగిన వివిధ సంఘటనలను ఈ ప్రదర్శన తెలియజేస్తుంది. భారతదేశపు అద్భుతమైన చరిత్ర మరియు సంస్కృతి గురించి గర్వించదగిన భావనను కలిగించడం కోసం ఈ రకమైన ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. భారత ప్రభుత్వ ఫోటో డివిజన్ నుండి పొందిన కొన్ని అరుదైన ఛాయాచిత్రాలతో సహా సుమారు 200 ఛాయాచిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనను తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సమన్వయంతో నిర్వహిస్తున్నారు.

ఇంతకుముందు, రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్.ఒ.బి.), హైదరాబాద్ 2021 మార్చి 12 న వరంగల్‌లో 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్యానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను నిర్వహించింది, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. అలాగే 2021 మార్చి 12 నుండి 14 వరకు హైదరాబాద్, నిజామాబాద్ మరియు నల్గొండలో ఇదే ఇతివృత్తంపై మూడు రోజుల పాటు ఫోటో ఎగ్జిబిషన్లను నిర్వహించారు.

మహాత్మా గాంధీ నేతృత్వంలోని చారిత్రాత్మక ఉప్పు సత్యాగ్రహం 91 వ వార్షికోత్సవం సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమంలో అధికారికంగా 2022 ఆగస్టు 15 కి 75 వారాల ముందు అంటే 2021 మార్చి 12 న లాంఛనంగా ప్రారంభించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లోని సంఘటనలు భారతదేశం 75 సంవత్సరాల పాటు సాధించిన విజయాలను ప్రదర్శిస్తాయి అంతే కాకుండా ఎక్కువగా ప్రజలకు తెలియని స్వాతంత్ర్య సమరయోధుల కథలను కూడా తెలియజేస్తాయి.

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ రూపంలో 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్యాన్ని స్మరించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాక, ఈ ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలను రూపొందించడానికి, 259 మంది సభ్యులతో గౌరవనీయ భారత ప్రధానమంత్రి అధ్యక్షతన ప్రభుత్వం జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ కమిటీలో అన్ని వర్గాల ప్రముఖులు, ప్రముఖ పౌరులు ఉన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమాల రూపకల్పనకు విధాన నిర్దేశం, మార్గదర్శకాలను ఈ కమిటీ అందిస్తుంది. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు 75 వారాలకు అంటే ఆగస్టు 15, 2022 వరకు తమ స్వంత ప్రణాళిక, కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి.