రెమిడెసివర్ ఉత్పత్తి పెంపుదలకు ప్రభుత్వం ఆమోదం

రెమిడెసివర్ ఉత్పత్తిని ఎక్కువ చేసి, సరఫరాను మెరుగు పరచి ధరను  తగ్గించాలని నిర్ణయించారు. దేశంలో రెమిడెసివర్ లభ్యత సరఫరా, ధరపై రెమిడెసివర్ ఉత్పత్తిదారులు, సంబంధిత వర్గాలతో  కేంద్ర రేవులు జలమార్గాలు రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి శ్రీ మనసుఖ్ మాండవీయ 2021 మార్చి 12, 13 తేదీల్లో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ప్రస్తుతం దేశంలో నెలకి 38.80 లక్షల రెమిడెసివర్ ఇంజెక్షన్లను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం వుంది. దీనిని ఏడు సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. దీనికి అదనంగా ఏడు ప్రాంతాల్లో నెలకి 10 లక్షల ఇంజెక్షన్లను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం వున్న ఆరు ఉత్పత్తిదారులకు యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇవికాకుండా నెలకు 30 లక్షల ఇంజెక్షన్లను ఉత్పత్తి చేయడానికి రంగం సిద్ధం చేశారు. దీనితో దేశంలో నెలకి 78 లక్షల రెమిడెసివర్ ఇంజెక్షన్లు అందుబాటులోకి వస్తాయి. 

దేశ మార్కెట్ లో రెమిడెసివర్ అందుబాటులో ఉండేలా చూడడానికి రెమ్‌డెసివిర్,ఏపీఐ  మరియు ఫార్ములా ఎగుమతులను 11.04.2021న డీజీఎఫ్టీ నిషేధించింది. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఎగుమతి చేయడానికి సిద్ధం చేసిన నాలుగు లక్షల రెమిడెసివర్ ఇంజెక్షన్లను ఉత్పత్తిదారులు స్వదేశీ మార్కెట్ కు మళ్లించారు. స్వదేశీ మార్కెట్ కు అవసరమైన రెమిడెసివర్ ఇంజెక్షన్లను సరఫరా చేయడానికి ఈఓయూ/ సేజ్ యూనిట్లను కూడా సిద్ధం చేస్తున్నారు. 

ఈ వారం చివరకి రెమిడెసివర్ ఇంజెక్షన్ ధరను 3,500 రూపాయల కన్నా తక్కువగా నిర్ణయించడానికి ఉత్పత్తిదారులు అంగీకరించారు. కోవిడ్ నివారణకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో జరుగుతున్న ప్రయత్నాలకు మద్దతుగా ఉత్పత్తిదారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఆస్పత్రులు/ సంస్థలకు అవసరమైన పరిమాణంలో రెమిడెసివర్ ఇంజెక్షన్లను సరఫరా చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉత్పత్తిదారులకు ప్రభుత్వం సూచించింది. 

రెమిడెసివర్ ఇంజెక్షన్లను నల్ల బజారులోకి తరలించేవారిపైనా, ఎక్కువ ధరలకు అమ్ముతున్నవారిపైన, అక్రమంగా దాచి పెడుతున్న వారిపైన కఠిన చర్యలను తీసుకోవాలని డీసీజీఐ రాష్ట్రాలు, కేంద్ర నిఘా అధికారులను ఆదేశించింది.