యాదాద్రి దర్శనంలో పురాణపండ శ్రీనివాస్ ‘శ్రీలహరి‘ : దేవస్థానం ఈ.ఓ. రామకృష్ణారావు


యాదాద్రి : జనవరి 26

పరమ రమణీయమైన శ్రీవైష్ణవ శోభతో అఖండానందాన్ని వర్షిస్తున్న తెలంగాణాలోని యాదాద్రి మహా పుణ్యక్షేత్రంలో భక్త భావుకులకోసం శ్రీ లక్ష్మీనృసింహుని దివ్యానుగ్రహంగా ఈ శనివారం నుండి శ్రీ లక్ష్మీనృసింహ దేవస్థానం ఒక అపురూప గ్రంధాన్ని ఉచితంగా సమర్పిస్తోంది.

ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీ నరసింహాచార్యులవారి పర్యవేక్షణలో .. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.రామకృష్ణారావు ఆదేశాలమేరకు ప్రముఖరచయిత పురాణపండ శ్రీనివాస్ శ్రీకరమైన మంత్ర సౌష్టవంతో , స్తోత్ర సాధనలతో, అపూర్వ సౌందర్యంతో ” శ్రీ లహరి ” పేరిట రచనా సంకలనంగా అందించిన మంగళ గ్రంధం వేలకొలది ప్రతులు ఆలయ కార్యాలయానికి శుక్రవారం చేరాయి.

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి అభిషేకం, బ్రేక్ దర్శనాలలో పాల్గొనే భక్తులకు ఇకపై ఈ నూటముప్పై రెండు పేజీల ఈ దివ్యమంగళగ్రంధాన్ని ఉచితంగా అందించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

శ్రీపూర్ణిమ, శ్రీమాలిక అఖండ గ్రంధాలతో తెలుగురాష్ట్రాల భక్తకోటిని విశేషంగా ఆకర్షించిన పురాణపండ శ్రీనివాస్ ఇప్పుడు యాదాద్రి ‘ శ్రీలహరి ‘ మంగళ గ్రంధాన్ని చాలా చక్కగా , పవిత్ర శోభతో , రమణీయమైన వ్యాఖ్యాన వైఖరీ దక్షతతో రచించి రూపొందించారని డిప్యూటీ ఈ.ఓ దోర్బల భాస్కర శర్మ ప్రశంసించారు.

తమ విజ్ఞప్తి మేరకు ఈ అపూర్వ గ్రంథ ప్రచురణ బాధ్యతను ఉదాత్తంగా సమర్పణ భావంతో స్వీకరించిన కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్యకి కార్యనిర్వహణాధికారి రామకృష్ణారావు కృతజ్ఞతలు తెలియజేసారు.

మహా శైవ క్షేత్రం శ్రీశైలదేవస్థానంకు ప్రత్యేకసలహాదారునిగా గతంలో సేవలందించిన ప్రముఖరచయిత పురాణపండ శ్రీనివాస్ ధార్మిక గ్రంధాల రచనలో, ప్రచురణలో తెలుగురాష్ట్రాలలో పవిత్రవిలువలతో దూసుకుపోవడం పలువురు పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని ఆశ్చర్యపరుస్తోంది.

ఎందరో పండితులు, రచయితలు, కవులు, సంకలనకర్తలు , ప్రచురణసంస్థలు చెయ్యలేని పారమార్ధిక సేవను పురాణపండ శ్రీనివాస్ ఒక్కరూ భుజాలకెత్తుకుని ఆత్మసమర్పణా భావంతో ముందుకు నడవడం కేవలం దైవబలమేనని యాదాద్రి దేవలెప్మెంట్ అధారిటీ చైర్మన్ , సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కిషన్ రావు సైతం కితాబివ్వడం పురాణపండ శ్రీనివాస్ అసాధారణ కృషీవలత్వానికి, రచనా సంస్కారానికి పరాకాష్టగా చెప్పకతప్పదని యాదాద్రి ఆలయ వేదపండిత, అర్చక వర్గాలు ప్రకటిస్తున్నాయి.

తెలంగాణలో ప్రధమశ్రేణికి చెందిన ఒక ఆలయం ఇలాంటి విలువైన పవిత్ర దివ్యగ్రంధాన్ని ప్రసాదంగా సమర్పించడం ఇదే తొలిసారికావడం విశేషం.