త్యాగరాయ గానసభలో ఏడవ ఆడిటోరియంను ప్రారంభించిన రమణాచారి , పురాణపండ


తెలుగు రాష్ట్రాల సంగీత , నాట్య కళా కారులకు ఒక చక్కని శుభవార్తతో తెర తీస్తోంది త్యాగరాయగానసభ. నాట్యం, సంగీతం శిక్షణను ఉచితంగా నేర్చుకోవాలనుకునే క్రొత్త తరానికి నిజంగా ఇది శుభవార్తే. ఇప్పటికే ఆరు ఆడిటోరియంలతో అలరారుతూ వేల కళాకారులను, సాహిత్య వేత్తలను , సంగీత ప్రియులను, గాయనీ గాయకులను తన వొడిలో చేర్చుకుని ఉన్నత స్థాయికి చేరుస్తున్న హైదరాబాద్ త్యాగరాయ గానసభలో ఏడవ ఆడిటోరియం కి తెర లేవడమే ఈ అద్భుత వార్త. కళా జనార్ధనమూర్తి ఘన సంకల్పంగా అపూర్వంగా నిర్మితమైన ఈ కళావేదిక ప్రారంభోత్సవంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె.వి .రమణాచారి. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

దశాబ్దాల ఘన సాంస్కృతిక, సాహిత్య చరిత్రతో ఎందరో కళాకారుల, సాహిత్యకారుల వైభవానికి కళామతల్లిగా ఆశీర్వదించిన శ్రీ త్యాగరాయ గానసభలో అనేక సంగీత ఉత్సవాలకు, ఉచిత సంగీత, నాట్య తరగతులకు నూతనంగా ఏడవ ఆడిటోరియం ను ప్రారంభించడం శుభ పరిణామమని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె.వి.రమణాచారి పేర్కొన్నారు. హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గానసభలో నూతనంగా ఏర్పాటైన సంగీత నాట్య కళా వేదికను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రముఖ రచయిత, ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ ఆరాధన ‘ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ … సంగీత, నాట్య రంగాలలో క్రొత్త తరాల శిక్షణకోసం శ్రమించి, పరిశ్రమించి మరీ ఇంత వైభవాన్ని నిర్మించడం ఏడుకొండలవాడి దయేనని అభినందించారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు , త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి అధ్యక్షత వహించారు. సభలు, సమావేశాలకు సహజంగా దూరంగా వుండే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ చక్కని కార్యక్రమానికి హాజరవ్వడంతో పలువురు సాహితీ, సాంసృతిక రంగాల ప్రముఖులు ఆప్యాయంగా పలకరించడం విశేషం.

హాస్య బ్రహ్మ, ప్రముఖ పాత్రికేయులు శంకర నారాయణ . త్యాగరాయగాన సభ కమిటీ సభ్యులు చక్రపాణి ప్రసాద్, వంశీ ఆర్ట్ థియేటర్స్ అధినేత వంశీ రామరాజు, అభినందన భవానీ, శ్రీమతి,పద్మజ నీలిమ , శ్రీమతి గీత తదితరులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ వారంనుండే ఉచిత సంగీత, నాట్య తరగతులు ప్రారంభించబడుతున్నాయని , అన్ని వర్గాలవారూ హాయిగా ఈ అపూర్వ అవకాశాన్ని వినియోగించుకోవాలని త్యాగరాయగానసభ అధక్షులు జనార్ధనమూర్తి కోరడం విశేషం.