‘బ్రో’ నిర్మాత విశ్వప్రసాద్ తల్లికి పురాణపండ “శ్రీమాలికతో” మంత్ర నీరాజనం.. సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల సమయస్ఫూర్తికి అభినందనలు


వివిధ సామాజిక మాధ్యమాల హోరులో కూడా తనదైన ఉనికిని, విలువలను కోల్పోకుండా అమృతమయమైన విశేషాలతో గ్రంధాలను రచించి, సంకలనీకరించి, లాభాపేక్ష అస్సలు లేకుండా ప్రచురిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ బృహత్తరంగా అందిస్తున్న అపురూప ధార్మిక గ్రంధాలు అటు సాధకులను, యిటు భక్త పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఆదిపురుష్ తెలుగు నిర్మాత, ప్రముఖ పారిశ్రామిక వేత్త, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చైర్మన్ టి.జి.విశ్వప్రసాద్ తన తల్లి జ్ఞాపకార్ధం(ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా ప్రచురణగా) పరమాద్భుతమైన “శ్రీమాలిక” అద్భుత గ్రంధాన్ని.. మంత్ర సంపదతో ఒక దివ్య గ్రంధంగా అందించి కొన్ని వేల ప్రతులను తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వివిధ శాఖల వారికి మాతృస్మృతిగా ఈ సోమవారం బహూకరించడం పట్ల జంటనగరాలకు చెందిన కొందరు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు విశ్వప్రసాద్ ని ప్రత్యేకంగా అభినందించారు.

ఆలయాలలో, మఠాలలో, పీఠాలలో, ధార్మిక మండళ్లలో ఉపయోగపడే ప్రత్యేక పవిత్రఅంశాలతో ఈ దివ్యగ్రంధాన్ని తన మిత్రులు, పార్టనర్ వివేక్ కూచిభొట్ల ప్రత్యేక శ్రద్ధతో ఈ గ్రంధాన్ని పురాణపండ శ్రీనివాస్ చే ఒక మంత్రపేటికలా శోభింపచేశారని ఈ సందర్భంగా విశ్వప్రసాద్ చెప్పారు.

సుమారు రెండువందల డెబ్బై రెండు పేజీలతో ఎంతో దైవీయ కారుణ్యాన్ని వర్షిస్తున్న ఈ పారంపుణ్యాల గ్రంధాన్ని యిన్ని వేలమందికి ఉచితంగా అందించే భాగ్యంకలగడం తన పూర్వ జన్మ సుకృతంగా విశ్వప్రసాద్, వందన విశ్వప్రసాద్ భావించడం వారి పవిత్రహృదయానికి, సమర్పణా భావనకు నిదర్శనం.

ఎప్పుడో గానీ ఇలాంటి అద్భుతమైన గ్రంధాలు లభించవని, ఇప్పుడు విశ్వప్రసాద్ తల్లి గీతాంజలి జ్ఞాపకంగా ఈ పుణ్యపేటిక లభించిందని పలువురు ప్రముఖులు అభినందించడం కనిపించింది.