హైదరాబాద్ లో తొలిసారిగా శ్రీ లలిత విష్ణు మంగళ గ్రంధాన్ని ఉచితంగా సమర్పిస్తున్న శృంగేరీ శ్రీ జ్ఞానసరస్వతీ ఆలయం


యుగాలుగా ఈ జగత్తుని పులకితం చేస్తున్న ఋషుల వర ప్రసాదాలైన సుమారు వందకు పైగా స్తోత్ర, వ్యాఖ్యాన నిధులతో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా అందిన మూడు వందల పేజీల అమోఘ గ్రంధం ‘శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ గ్రంధాన్ని జంట నగరాల సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక సంస్థలకు, వేద పాఠశాలలకు, అర్చకులకు, వేదపండితులకు ఉచితంగా వితరణ చేయనున్నట్లు ప్రఖ్యాత సాంస్కృతిక కళా వేదిక ‘త్యాగరాయ గాన సభ’ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి పేర్కొన్నారు.

శ్రీ గణపతి నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకుని శృంగేరీ పీఠాధీశ్వరులు శ్రీ భారతీ తీర్ధ, శ్రీ విధుశేఖర భారతీ స్వామివార్ల అనుగ్రహ వాత్సల్యంతో సమర్పిస్తున్న ఈ పవిత్ర కార్యాన్ని సెప్టెంబర్ 4,5 వ తేదీలలో ఉదయం తొమ్మిది గంటల నుండీ సాయంకాలం ఐదు గంటలవరకూ ముషీరాబాద్ గాంధీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న జ్ఞాన సరస్వతీ దేవాలయంలో ఈ గ్రంధాన్ని ఉచితంగా అందజేస్తామని ఆయన చెప్పారు.

ఈ మంత్ర ప్రసాద వితరణ శ్రీకార్యానికి స్ఫూర్తిదాయకమైన ప్రోత్సాహాన్నిచ్చిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రత్యేక సలహాదారులు, సీనియర్ ఐఏఎస్ అధికారి కె.వి. రమణాచారికి , కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి , బండి సంజయ్, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ లకు జనార్ధనమూర్తి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అద్భుతాలు పై లోకాల నుండి ఊడిపడవని, మహా సాధనతోనే దైవీయ స్పృహల అంశాలు అనుభూతుల్ని ఆవిష్కరిస్తాయని ఎన్నో అపురూప రచనలతో, సంకలనాలతో నిరూపించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ నిస్వార్ధ యజ్ఞ భావనను ఈ సందర్భంగా జనార్ధనమూర్తి ప్రశంసించారు. భావజాలపరీవ్యాప్తి కోసమే ఈ శ్రీకార్యాన్ని భుజాన వేసుకుని తామంతా శ్రీసరస్వతీసేవకు ఉపక్రమించామని ఆయన చెప్పడం విశేషం.

జంటనగరాల చరిత్రలో మూడువందల పేజీల దివ్య గ్రంధాన్ని అర్చక వేదపండితులకు, ధార్మిక సాంస్కృతిక కళా సంస్థలకు, ఆలయాలకు ఉచితంగా వితరణ చెయ్యడం ఇదే ప్రథమమని జనార్ధనమూర్తి చెప్పారు

పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనం మూడు వందల పేజీల అమోఘ గ్రంధం ‘శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ గ్రంధాన్ని ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవిష్కరించగా, తెలంగాణ హైదరాబాద్ త్యాగరాయ గానసభలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, సీనియర్ ఐఏఎస్ అధికారి కె.వి . రమణాచారి ఆవిష్కరించి ప్రశంసలు వర్షించడం విశేషం.