Site icon TeluguMirchi.com

ఐపీఎస్ ల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న రాష్ట్రపతి

pranab2012 IPS ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్ ఆంధ్రప్రదేశ్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హాజరయ్యారు. రాజ్‌భవన్‌ నుంచి పోలీస్‌ అకాడెమీకి చేరుకున్న ఆయన ముందుగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పరేడ్‌ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక వాహనంలో మైదానంలో పర్యటించి పరేడ్‌ను తిలకించారు. ఆయన వెంట గవర్నర్‌ నరసింహన్‌ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. సామాన్యులకు న్యాయం చేసే లక్ష్యంతోనే IPS అధికారులు పనిచేయాలని అన్నారు. మత సామరస్యం కాపాడడంలో IPS లది కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు. జస్టిస్‌ వర్మ కమిటీ సూచనల మేరకు మహిళలపై వేధింపుల విచారణకు కొత్తం చట్టం తెచ్చినట్లు రాష్ట్రపతి తెలిపారు.ఉగ్రవాదం, చొరబాటుదారులను అరికట్టడంలో భారత ప్రభుత్వం కృతనిశ్చయంలో పని చేస్తోందని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. కాగా, శిక్షణ పూర్తి చేసుకున్న 148 మంది IPS అధికారులు ఈ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్నారు. వీరిలో ఏపీ కేడర్‌కు చెందిన వారు 8 మంది ఉన్నారు.

Exit mobile version