ప్రతి నెల 1 లేదా 15వ తారీకున పెట్రోల్ మరియు డిజిల్ రేట్లు ఎక్కువ లేదా తక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెలలో రెండు సార్లు డిజిల్ మరియు పెట్రోల్ రేట్లను సమీక్షిస్తూ ఆయిల్ కంపెనీలు రేటును నిర్ణయిస్తాయి. అయితే ఇకపై ప్రతి రోజు పెట్రోల్ రేట్లు ఎక్కువ అవ్వడం లేదా తక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి కనుక వస్తే ఈ విధానానికి మారాలని ఆయిల్ కంపెనీలు భావిస్తున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పలికే రేటును బట్టి డిజిల్ మరియు పెట్రోల్ల రేట్లు ఉంటాయి అనే విషయం తెల్సిందే. అక్కడ క్రూడాయిల్ ధరలు రోజు రోజుకు మారుతూ ఉంటాయి. దాంతో రేటు పెరిగినప్పుడు కంపెనీలు నష్టాలు భరించాల్సి వచ్చింది, కొన్ని సార్లు వినియోగదారులు నష్టపోవాల్సి వస్తుంది. ఆ కారణంగానే ప్రతిరోజు రేట్లను సమీక్షించే విధానం తీసుకు రావాలని నిర్ణయించారు. అయితే రేట్లు అనేది రోజులో ఒక్కసారి మాత్రమే మారాలా లేక గంట గంటకు కూడా మారుతుందా అనేది చూడాల్సి ఉంది.