ఫుడ్ డెలివరీకి జొమోటో, స్విగ్గీ యాప్స్ పర్యాయపదాలుగా మారిపోయాయి. ఈ వేదికలపై ఫుడ్ ఆర్డర్ చేయని నగరవాసి లేడంటే అతిశయోక్తి కాదేమో. కానీ వీటిల్లో ఫుడ్ ఆర్డర్ చేయడం ఇప్పటికీ కాస్తంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. మరి వీటికంటే తక్కువ ధరకు ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే అంతకంటే ఏం కావాలి చెప్పండి. అందుకే ప్రస్తుతం జొమోటో, స్విగ్గీలకు గట్టి పోటీ ఇస్తూ పాప్యులారిటీ పెంచుకుంటోంది ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫాం. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో జోమాటో-స్విగ్గీ ఆధిపత్యానికి గట్టి పోటీ ఇస్తూ.. ఓపెన్ నెట్‌వర్క్‌లో ఆన్‌లైన్ ఆర్డర్‌లు ఇవ్వడానికి 50,000 రెస్టారెంట్లు ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నాయని ఓఎన్‌డీసీ సోమవారం తెలిపింది.
ఓపెన్ నెట్‌వర్క్‌లోని రెస్టారెంట్‌ల సంఖ్య ఫిబ్రవరి 2023లో 500 నుంచి ఆగస్టు 2023లో 50,000కి పెరిగింది. భారత ప్రభుత్వమే రూపొందించిన ఓఎన్‌డీసీ వేగంగా వృద్ధి చెందుతోంది. సెప్టెంబర్ 2022లో మొదటి ఆర్డర్‌తో ప్రారంభమైన నెట్‌వర్క్ ఇప్పటి వరకు 50,000 రెస్టారెంట్లను ఆన్‌బోర్డ్ చేసిందని ఓన్‌డీసీ ఎండీ, సీఈవో టీ.కోశి అన్నారు. ఓఎన్‌డీసీ 2023 చివరి నాటికి రెస్టారెంట్ కౌంట్‌ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారులు పేటీఎం, పిన్‌కోడ్, మేజిక్‌పిన్, మైస్టోర్ వంటి వాటితో సహా కొనుగోలుదారు యాప్‌ల ద్వారా ఓఎన్‌డీసీ నెట్‌వర్క్‌లో ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.