ఇప్పటికే కరోనా కేసులతో దేశం మొత్తం అతలాకుతలం అవ్వగా..ఇప్పుడిప్పుడే కరోనా నుండి కాస్త బయట పడుతున్న క్రమంలో ..ఇప్పుడు సరికొత్త కరోనా కేసు బయటపడింది. బ్రిటన్ నుంచి ఈ నెల 21న ఢిల్లీకి వచ్చిన రాజమండ్రి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో జిల్లా అధికారులు ఆమెను ఢిల్లీ విమానాశ్రయంలో క్వారంటైన్ లో ఉంచగా తప్పించుకుని ఏపీ ఎక్స్‌ప్రెస్ రైల్లో బుధవారం రాత్రి రాజమండ్రికి వచ్చారు. ఈ విషయం తెలియడంతో వెంటనే అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సదరు మహిళను, ఆమె కుమారుడిని స్టేషన్ నుంచి నేరుగా గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమె రక్త నమూనాలను పూణె ల్యాబ్ కు పంపనున్నారు.
బ్రిటన్‌లో అలజడి రేపుతున్న ఈ జన్యుమార్పిడి కరోనా వైరస్ భారత్‌లోనూ వణుకు పుట్టిస్తోంది. బ్రిటన్‌లో పెద్ద మొత్తంలో మ్యుటేటెడ్ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ కఠినమైన లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. భారత్, ఈయూతో పాటు పలు దేశాలు కూడా బ్రిటన్‌కు విమాన సేవలను నిలిపివేశాయి. ఐతే ఇటీవలే బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు చేయగా 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.