వీళ్లకు మ్యూకోమైకోసిస్ ఎక్కువగా సోకుతుందట!

కోవిడ్-19 బారినపడిన వారిలో అతి తక్కువమందికి   మ్యూకోమైకోసిస్     సోకుతున్నదని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ తెలిపారు. ఈ రోజు ‘ ‘కోవిడ్ -19 కి సంబంధించి  మ్యూకోమైకోసిస్ దంత     సంరక్షణ ‘ అనే అంశంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ రోజు నిర్వహించిన వెబ్‌నార్ లో డాక్టర్ రాజీవ్ జయదేవన్ తో పాటు  ప్రోస్టోడోంటిస్ట్ డాక్టర్ నీతా రానా పాల్గొని  మ్యూకోమైకోసిస్     పై వివరణ ఇస్తూ దాని నివారణకు అనేక సూచనలు చేశారు. ప్రముఖ డాక్టర్లు ఇచ్చిన సలహాలు సూచనలు ఇలా ఉన్నాయి :

మ్యూకోమైకోసిస్ ప్రజలకు ఎందుకు సోకుతుంది ?

కోవిడ్-19 బారిన పడిన రోగులకు మ్యూకోమైకోసిస్ సోకే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న డాక్టర్ జయదేవన్ దీనిపై వివరణ ఇచ్చారు. ‘మధుమేహ వ్యాధి కలిగిన వారు  కోవిడ్-19 బారిన పడితే వారికి ఇచ్చే స్టెరాయిడ్ వల్ల రోగనిరోధక శక్తిపై మూడు రెట్ల ప్రభావం చూపిస్తుంది. కోవిడ్-19 శరీరంలో అనేక అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. రోగనిరోధక శక్తిపై కూడా దీని ప్రభావం ఉంటుంది.’అని అన్నారు. మధుమేహవ్యాధికి మ్యూకోమైకోసిస్ కి సంబంధం ఉందని ఆయన వివరించారు. ‘ మనదేశంలో ఎక్కువమంది ప్రజలకు మధుమేహవ్యాధి వుంది. జనాభాపరంగా చూస్తే ఇతర దేశాల కన్నా మనదేశంలో ఎక్కువమంది అనారోగ్యానికి గురవుతున్నారు. దీనితో మధుమేహవ్యాధి ఉన్నవారికి  మ్యూకోమైకోసిస్ సోకే అవకాశం ఉందని అర్ధం చేసుకోవలసి ఉంటుంది ‘ అని ఆయన అన్నారు. 

కోవిడ్ పై అనేక వ్యాసాలు ప్రచురించి డాక్టర్లు, విధానానిర్ణేతలకు సలహాలు సూచనలు ఇచ్చిన డాక్టర్ జయదేవన్ ‘ కోవిడ్-19 రోగులలో తక్కువ మంది మ్యూకోమైకోసిస్ బారిన పడుతున్నారు. కోవిడ్ పెరుగుతున్న సమయంలో మ్యూకోమైకోసిస్ కేసులు పెరిగే అవకాశం ఉంది ‘ అని ఆయన అన్నారు. 

‘మధుమేహవ్యాధి లేదా అవయవ మార్పిడి వల్ల రోగనిరోధకశక్తి తక్కువగా వున్నవారు మ్యూకోమైకోసిస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది . అయితే, గత ఒకటి రెండు నెలల్లో ఈ పరిస్థితిలో లేనివారికి కూడా మ్యూకోమైకోసిస్ రావడం మనం చూస్తున్నాం. ఇది నూతన పరిమాణం. రోగం సోకే అవకాశం లేనివారికి కూడా మ్యూకోమైకోసిస్ ఎందుకు సోకుతున్నదన్న అంశంపై పరిశోధనలు జరగవలసిన అవసరం ఉంది. పరిశోధనల్లో కారణాలు వెల్లడవుతాయి’ అని ఆయన పేర్కొన్నారు. 

మధుమేహవ్యాధి – మ్యూకోమైకోసిస్:

మధుమేహరోగుల్లో బ్లడ్ గ్లూకోస్ లో చెక్కర స్థాయిలను నియంత్రించడం సాధ్యం కాదని దీనితో వీరిలో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుందని డాక్టర్ జయదేవన్ వివరించారు. వ్యాధి తీవ్రంగా ఉన్నవారి న్యూట్రోఫిల్స్ వంటి వ్యాధికారక-పోరాట కణాల పనితీరు బలహీనపడుతుందని డాక్టర్ జయదేవన్ తెలిపారు. ఇటువంటి లక్షణాలు కలిగి వున్నవారు  మ్యూకోమైకోసిస్  బారినపడే అవకాశాలు ఎక్కువగా వుంటాయని ఆయన అన్నారు. అధిక చక్కెర స్థాయి ఫంగల్ పెరుగుదలకు అనుకూలంగా ఉంటుందని వివరించిన ఆయన  చక్కెరను ఫంగస్ ప్రేమిస్తుందని వ్యాఖ్యానించారు. జింక్ తో పాటు చనిపోయిన కణజాలంపై కూడా పెరుగుతుందని అన్నారు. కొత్త కణాలు ఏర్పడే వరకు ఫంగస్ పెరుగుతూనే ఉంటుందని అన్నారు. ఫంగస్ తరువాత దశలో ‘ రక్త కణాల లోకి ప్రవేశిస్తుంది. ఆక్సిజన్ అందక కణాలు పనిచేయడం మానివేస్తాయి. ఇవి నల్లగా మారిపోతాయి. దీనివల్లనే  మ్యూకోమైకోసిస్  బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నారు’ అని డాక్టర్ జయదేవన్ అందరికి అర్ధం అయ్యేవిధంగా వివరించారు. 

దంత సంరక్షణ — మ్యూకోమైకోసిస్ :

కోవిడ్-19కి దంత సంరక్షణకు సంబంధం ఉందని ప్రముఖ దంతవైద్యుడు డాక్టర్ నీతా రాణా స్పష్టం చేశారు. పళ్ళు, దంతాలు, చిగుళ్ళను సక్రమంగా నిర్వహించినప్పుడు సహజంగా ఏర్పడే సూక్ష్మజీవులు సక్రమంగా పనిచేస్తాయని దీనితో వైరస్ సోకే అవకాశం తక్కువగా ఉంటుందని ఆయన వివరించారు. పళ్ళు తొలగించిన తరువాత ఏర్పడే గాయాలను తగ్గించడానికి, నోటిని శుభ్రంగా ఉంచడానికి శ్రద్ధ చూపని పక్షంలో మ్యూకోమైకోసిస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. 

 పళ్ళు , నోరు కడుక్కోవడం మరియు ప్రక్షాళన చేయడం ద్వారా  దంత ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని డాక్టర్ నీతా సలహా ఇచ్చారు.

టీకాలు- మ్యూకోమైకోసిస్:

టీకా తీసుకున్న తరువాత సోకే కోవిడ్ వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని డాక్టర్ జయదేవన్ అన్నారు. కోవిడ్ లక్షణాలు తక్కువగా ఉన్నప్పుడు మందులు ఎక్కువగా వాడవలసిన అవసరం ఉండదని  పేర్కొన్న డాక్టర్ జయదేవన్ ఇటువంటి సమయాల్లో   మ్యూకోమైకోసిస్ సోకే అవకాశం ఉండదని అన్నారు. అయితే, వ్యాధి లక్షణాలు తక్కువగా ఉన్నప్పటికీ అవసరం లేని మందులు తీసుకుంటూ సొంత వైద్యం చేసుకొంటే ఫంగస్ సోకే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. 

కోవిడ్ సోకిన తరువాత  మ్యూకోమైకోసిస్:

పడవ వెళ్లిన కొంతసేపటి వరకు నదిలో అలలు ఎలా వుంటాయో అదేవిధంగా కోవిడ్ తగ్గినా తరువాత దాని ప్రభావం మన శరీరంపై ఉంటుందని డాక్టర్ జయదేవన్ అన్నారు. వ్యాధి నుంచి బయటపడిన కొంతకాలం వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. మన శరీరంలో వుండే మంచి  ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాపై దాడి చేయకుండా మన శరీర రక్షణను మెరుగుపరుస్తుందని  అధ్యయనాలు తేల్చిచెప్పాయని పేర్కొన్న డాక్టర్ జయదేవన్ అనవసరంగా ఎక్కువకాలం యాంటీబయాటిక్స్ ని వాడకుండా ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు. సొంత వైద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆయన అన్నారు. డాక్టర్లు ఇచ్చే సలహాలను పాటిస్తూ అనవసరంగా మందులను తీసుకోవద్దని ఆయన సూచించారు. 

పరిసరాల నుంచి మ్యూకోమైకోసిస్ సోకుతుందా?

ఫంగస్ అనేది ప్రతి చోటా ఉంటుందని చెప్పిన డాక్టర్ జయదేవన్ దీని గురించి అనవసరంగా భయపడవలసిన అవసరం లేదని అన్నారు. ఫంగస్ అనేక వేల సంవత్సరాల నుంచి ఉందని వివరించిన ఆయన మ్యూకోమైకోసిస్ అనేది అరుదుగా కొంతమందికి మాత్రమే సోకుతుందని అన్నారు. 

మహమ్మారి కాలంలో దంత సంరక్షణ

“మీ దంత వైద్యుడితో సన్నిహితంగా ఉండండి.  టెలికాన్సల్టేషన్ చాలా సందర్భాల్లో సహాయపడుతుంది.  మార్గదర్శకాలను పాటించే దంత వైద్యశాలల్లో ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి.  అతి జాగ్రత్తలు పోకుండా డాక్టర్ ఇచ్చే సలహాలను పాటించండి “అని డాక్టర్ నీతా సలహా ఇచ్చారు. 

 టీకాలు ఎంతకాలం రోగనిరోధక శక్తిని ఇస్తాయి?

 ” తీవ్రమైన వ్యాధి లేదా మరణం నుంచి టీకాలు రక్షిస్తాయి . టీకా వల్ల కలిగే రోగ నిరోధికశక్తి దీర్ఘకాలం పనిచేసి మనల్ని అనేక సంవత్సరాలు రక్షిస్తుంది’ అని డాక్టర్ జయదేవన్  .అన్నారు. 

 కోవిడ్ –19 కి గురైన వారికి సలహా

  “కోవిడ్ ని  తేలికగా తీసుకోకండి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. కానీ, 5-6 రోజుల తరువాత అలసట ఎక్కువ అవుతూ ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి ఛాతీలో నొప్పి, తినాలని లేకపోవడం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లడం లేదా డాక్టర్ సలహాను తీసుకోవడం మంచిది. టెలికాన్సల్టేషన్ ద్వారా కూడా డాక్టర్ సలహాను పొందవచ్చును’ అని డాక్టర్ జయదేవన్ అన్నారు.