కోవిడ్ టీకాల కార్యక్రమం: అపోహలు-వాస్తవాలు

కోవిడ్ టీకాలు వేయించుకున్నవారిలో సంతానోత్పత్తి వయసులో ఉన్నవారైతే వారికి వంధ్యత్వం వచ్చే అవకాశాలున్నట్టు  మీడియాలో కొన్ని అందోళనకర వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా ఇలాంటి అపోహలను, మరికొన్ని మూఢ నమ్మకాలను మీడియా ప్రచారం చేస్తోంది. ఇవి ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులలో అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి.  టీకాల కార్యక్రమాలు ఊపందుకుంటున్న సమయంలో ఇలాంటి పుకార్లు రావటం దురదృష్టకరం. ఆ మాటకొస్తే, గతంలో పోలియో తదితర  టీకాల సమయంలో కూడా ఇలాంటివే పుకార్లు వ్యాపించాయి. 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సాధారనంగా ఎదురయ్యే ప్రశ్నలకు జవాబుల రూపంలో ఇలాంటి అనేక అనుమానాలకు సమాధానాలతో కూడిన వివరణను తన వెబ్ సైట్ లో  పొందుపరచింది. అందుబాటులో ఉన్న ఏ టీకాలూ వంధ్యత్వానికి దారితీయవని పేర్కొంది:  (https://www.mohfw.gov.in/pdf/FAQsforHCWs&FLWs.pdf) అన్ని టీకాలూ ముందుగా జంతువుల మీద, ఆ తరువాత మనుషుల మీద ప్రయోగించి దుష్పరిణామాలు ఏవైనా ఉంటాయేమో పరీక్షించటం తప్పనిసరి అనే విషయాన్ని మరోమారు అందులో గుర్తు చేశారు. అవి సురక్షితమని నిర్థారణ జరిగిన మీదటే వాడకంలోకి తీసుకువస్తారు. 

పైగా, ఇప్పుడు కోవిడ్-19 టీకాల వలన వంధ్యత్వం వస్తుందన్న ప్రస్తుత ప్రచారం అపోహమాత్రమేనని భారత ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఈ అనుమానాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవని, ఈ టీకా మందు సురక్షితమని, సమర్థవంతమైనదని భారత ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన  వివరణను ఈ క్రింది లింక్ లో చూడవచ్చు. (https://twitter.com/PIBFactCheck/status/1396805590442119175)

పాలిచ్చే తల్లులందరికీ కోవిడ్ టీకాలు వేయాల్సిందిగా టీకాల నిర్వహణపై జాతీయ నిపుణుల బృందం సిఫార్సు చేసింది. టీకా కు ముందుగాని, తరువాత గాని పాలివ్వటం ఆపాల్సిన అవసరమేదీ లేదని కూడా సిఫార్సులలో స్పష్టం చేసింది. (https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1719925).