కేంద్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వంను ఏర్పర్చిన నేపథ్యంలో పలు సంచలన నిర్ణయాలు మోడీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరిగా ఉండేవి. కాని ఇప్పుడు మోడీ ప్రభుత్వంకు పూర్తి స్థాయి బలం ఉంది. అందుకే ఏం చేయాలన్నా ఎలాంటి ఆందోళన లేకుండా చేసేస్తోంది. ఈ సమయంలోనే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంది. ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ దేశంలో అధికారింలోకి వచ్చే అవకాశం లేదు. ఏం చేసినా కూడా మేమే మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమా బీజేపీ నాయకుల్లో వ్యక్తం అవుతుంది. అందుకే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు సైతం వెనుకాడటం లేదు.
ఇప్పటి వరకు నోట్ల రద్దు, జీఎస్టీ, ధరల పెంపు, ఆయిల్ కంపెనీలు రోజు రేట్లను సవరించుకునే విధానం ఇలా పలు ప్రజా వ్యతిరేక విధానాలను మోడీ ప్రభుత్వం అమలు చేస్తుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ నాయకుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం సామాన్యులకు అందిస్తున్న వంటగ్యాసు రాయితీని తొలగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాయితీ మొత్తంను బ్యాంకుల్లో వేస్తున్న విషయం తెల్సిందే.
మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి కూడా ధనికులు గ్యాస్ రాయితీని వదులుకోవాలి అంటూ ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఎంత ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోతుంది. దాంతో మొత్తానికే రాయితీని ఎత్తివేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా కాకుండా మెల్ల మెల్లగా రాయితీని తగ్గిస్తూ రెండు లేదా మూడు సంవత్సరాల్లో పూర్తిగా ఎత్తి వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.