కోతులు జనావాసాల్లోకి వచ్చాయి అంటే ఇంట్లోకి దూరి తినే వస్తువులు ఎత్తుకు వెళ్లడం చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పల్లెటూర్లలో ఇల్లలో కోతులు చొరబడి అన్నం, బియ్యం ఇంకా ఏం ఉంటే అవి తినేందుకు ప్రయత్నిస్తాయి. అయితే గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాత్రం ఒక కొండముచ్చు ఇంట్లోకి వెళ్తే దానికి తినేందుకు ఏం దొరక్కపోవడంతో చేసేది లేక అక్కడ కనిపించిన మొబైల్ ఫోన్‌ను ఎత్తుకు వెళ్లింది. మొబైల్ ఫోన్ కనిపించడం లేదని అటు ఇటు వెదుక్కుంటున్న వ్యక్తికి తన ఫోన్ కొండముచ్చు వద్ద ఉందని తెలిసింది.
ఆ కొండముచ్చుకు అరటి పండ్లు పెట్టడంతో పాటు, దానికి తినేందుకు చాలానే ఇచ్చాడు. కాని అది మాత్రం అవన్ని తిని ఫోన్‌ను తన వద్దే ఉంచుకుంది. ఫోన్ వచ్చినప్పుడైనా అది వదిలేస్తుందేమో అని మరో ఫోన్‌తో రింగ్ చేస్తే దాంట్లో వచ్చే పాటను ఎంజాయ్ చేస్తూ ఆసక్తిగా చూస్తోంది. ఫోన్‌లో వస్తున్న సౌండ్స్‌కు ఆకర్షితం అయిన కొండముచ్చు ఆ ఫోన్‌ను వదలడం లేదు. కొండముచ్చు తన ఫోన్ ఎత్తుకు వెళ్లిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తామేం చేస్తామంటూ చేతులు ఎత్తేసి, దాన్ని జాగ్రత్తగా గమనించి అది ఎక్కడయితే వదిలేస్తుందో అప్పుడు తీసుకో అన్నారట. ప్రస్తుతం ఆ కొండముచ్చు వెంట జనాలు పడుతున్నారు. అది ఇప్పటికే ఫోన్‌ను అటు ఇటు వేయడంతో కాస్త పలిగినట్లుగా కూడా ఉంది.