హైదరాబాద్ ఆసిఫ్ నగర్ కు చెందిన యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో తన ప్రోఫైల్ను మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత అతని ప్రోఫైల్ చూసి విజయనగరానికి చెందిన యువతి 9 నెలల క్రితం అతడిని సంప్రదించింది. పెళ్లి చేసుకుందామని మాయమాటలు చెప్పి నమ్మించి అతని దగ్గర డబ్బులు వసూలు చేసింది.
ఒకరికొకరు చాటింగ్ చేసుకోవడం, ఫోన్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు . కొన్ని రోజుల అనంతరం తన అమ్మకు ఒంట్లో బాగోలేదని ఆసుపత్రిలో చూపించాలని యువకుడికి మాయమాటలు చెప్పింది. డబ్బులు కావాలి అర్జెంట్ అంటూ యువకుడి వద్దనుంచి పలుమార్లు డబ్బులు తీసుకుంది. ఓ సారి 30 వేలు, మరోసారి 20 వేలు ఇలా మొత్తం రూ. 1.08 లక్షలను ఆ యువకుడి నుంచి తీసుకుంది. పెళ్లి ఎప్పడు చేసుకుందామంటూ ఆ యువకుడు అడుగుతుంటే ఇంతకాలం దాటవేస్తూ వచ్చింది. ఇక లాభం లేదనుకున్న ఆ యువకు పెళ్లి విషయంపై ఆ యువతిని గట్టిగా నిలదీయటంతో తల్లి, కూతుళ్లు ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. దీంతో ఆ యువకుడు ఆదివారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. జరిగిందంతా పోలీసులకు చెప్పాడు. యువకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు ప్రారంభించారు.