ఆయనో ఎస్‌ఐ.. నలుగురికి న్యాయం చెప్పాల్సిన వ్యక్తి. సమాజం భద్రతపై భాద్యత కలిగినవాడు. కానీ ఆ వ్యక్తే విచక్షణ కోల్పోయాడు. ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య, ఆమె తల్లిపై కిరాతకంగా వ్యవహరించాడు. కరీంనగర్ మొగిళ్లపాడు గ్రామానికి చెందిన ఎస్సై జితేందర్ 2015లో వెంకటాపురంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో పాల్వంచకు చెందిన పర్వీన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ప్రస్తుతం వారిద్దరికి ఓ బాబు పుట్టగా.. తొలిసారి గర్భం దాల్చినప్పుడు పుట్టేది ఆడపిల్లని తెలుసుకుని బలవంతంగా అబర్షాన్ చేయించాడని, ఆ తర్వాత గర్భం దాల్చగా మూడో నెలలో తన అత్తగారిల్లు కరీంనగర్ మెగిళ్లపాలెం (ఎస్‌ఐ స్వగ్రామం)లో వదిలిపెట్టాడని పర్వీన్ ఆవేదన వ్యక్తం చేసింది. బాబు పుట్టాక.. బారసాలకు రాలేదని పేర్కొంది.
ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంవల్లే తనను దూరంగా ఉంచుతున్నాడని, ఈ విషయంపై బంధువులు జితేందర్‌ను నిలదీయగా వారిపై దాడికి దిగాడని పర్వీన్ వాపోయారు .తనపై పిడిగుద్దులు గుద్ది తీవ్రంగా గాయపరిచాడని, అడ్డువచ్చిన తన తల్లి తహెరాను కూడా కొట్టడంతో ఇద్దరికీ తీవ్రగా యాలయ్యాయని రోదించింది. ఇదే విషయంతో గతం లో తాను జితేందర్‌ను ప్రశ్నించగా.. చేతి నరాలు తెగిపోయేలా కత్తితో గాయపరిచాడని, రూ.50 లక్షల కట్నం, ఇల్లు కావాలంటూ గొడవ చేసి తరచూ తనను కొట్టేవాడని తెలిపింది.
తన భర్త ఎస్‌ఐ జితేందర్ పై చట్టరీత్యా చర్యలను తీసుకోవాలని ఫిర్యాదు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మణుగూరు సీఐ కొండ్ర శ్రీనివాస్‌కు పర్వీన్ ఫిర్యాదు చేశారు. సంఘటనపై మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబాను వివరణ కోరగా బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై జితేందర్‌పై కేసు నమోదు చేశామన్నారు.