ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. ప్రస్తుతం దేశంతో పాటు ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్ 2 గురించి దీదీ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న ఆర్ధిక సంక్షోభం నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయోగం చేయించింది అంటూ ఆమె విమర్శించింది. గత ప్రభుత్వాలు ఇలాంటి వాటిని పక్కన పెడితే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి వాటిని నిర్వహించి ప్రజలను ఏమార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది.
ఇక చిదంబరం అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపించడంపై కూడా తీవ్ర స్థాయిలో ఆమె విమర్శలు చేసింది. ఆయన తప్పు చేశాడో లేదో అనే విషయం నాకు తెలియదు. కాని ఆయన ఒక మాజీ ఆర్ధిక మంత్రి, హోం మంత్రి అనే విషయాన్ని మనం అంతా కూడా గుర్తు పెట్టుకోవాలంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఉన్నట్లుండి దేశంలోని నేతలందరిని ఇలా అరెస్ట్లు చేయించడం తనకు అంతు చిక్కడం లేదంది. ఇలాంటి పరిస్థితులపై ప్రతిపక్షాలు ఎందుకు ఏకం కావడం లేదో నాకు అర్థం కావడం లేదని ఆమె వాపోయింది. అయితే మమత చేసిన చంద్రయాన్ 2 వ్యాఖ్యలపై కొందరు విమర్శలు చేస్తున్నారు. దేశం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునే చంద్రయాన్ ప్రయోగం గురించి అలాంటి కామెంట్స్ చేయడం తప్పు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.