లాక్ డౌన్ పేరుతో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడుతున్నారు ప్రజలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం అయ్యారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటకు రావడం లేదు. అలాగే పోలీసులు సైతం రోడ్ల ఫై ఎవరైనా కనిపిస్తే వారి లాఠీకి పనిచెపుతున్నారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పోలీసులు అలా ప్రవర్తించడంలో తప్పు లేదు. అయితే, కొందరు పోలీసులు విచక్షణ కోల్పోయి, ఓవరాక్షన్ చేస్తున్నారు. కారణం లేకుండానే కొడుతున్నారు. ఇప్పటికే పలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ కాగా..తాజాగా కానిస్టేబుల్ ఫై తండ్రీ కొడుకులు తిరగబడిన ఘటన టెక్కలి మండలం పరశురాంపురం లో చోటు చేసుకుంది.
రైతుబజార్ వద్ద శనివారం కానిస్టేబుల్ భైరి జీవరత్నం విధులు నిర్వహిస్తున్నారు. టెక్కలి మండలం పరశురాంపురం గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు వాకాడ శ్రీనివాసరావు, వినీత్‌లు బైక్‌పై వెళ్తుండగా కానిస్టేబుల్ ఆపారు. దీంతో ఆ తండ్రీ కొడుకులు కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు. బైక్ ఎందుకు ఆపావంటూ అతడిపై దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీని లాక్కుని ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. వినీత్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ జీవరత్నాన్ని జిల్లా ఎస్పీ కె.అమ్మిరెడ్డి పరామర్శించారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడితే కఠినచర్యలు తప్పవని ఎస్పీ తెలిపారు.