దేశం సైన్స్ అండ్ టెక్నాలజీ లో దూసుకుపోతుంటే మరోపక్క మూఢనమ్మకాలతో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లా పెరవలి గ్రామంలో చోటు చేసుకుంది. పెరవలి గ్రామానికి చెందిన నరేశ్ వ్యవసాయ కూలి పనులకు వెళ్తున్నాడు. ఈనెల 1న మూర్ఛతో అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు స్థానిక భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అతనికి పట్టిన దెయ్యం, వదిలిస్తానంటూ భూతవైద్యుడు ఈత బరిగెలు, కర్రలతో తీవ్రంగా కొట్టాడు. భూతవైద్యుడి దెబ్బలకు తీవ్ర గాయాలపాలైన నరేష్‌ను కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు కుటుంబసభ్యులు. నరేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరకు మృతి చెందాడు.
దీనిపై స్పందించిన గ్రామస్తులు భూతవైద్యుడు చిత్రహింసలు పెట్టడం వల్లే అతి దారుణంగా కొట్టడం వల్లే మృతి చెందాడు. నరేష్ ఒంటినిండా భూతవైద్యుడు కొట్టిన దెబ్బలతో వాతలు ఉన్నాయి. అంత్యక్రియలు చేసేటప్పుడు కూడా ఒంటిపై దెబ్బలు ఉన్న విషయం చూసాము. భూతవైద్యుడు దెబ్బల నుంచి పెరవలి గ్రామాన్ని రక్షించాలని పోలీసులను వేడుకుంటున్నాం. మరో యువకుడు భూతవైద్యుడు చేతిలో ప్రాణాలు పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని అన్నారు.