ఐపీఎల్ 2023 లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు చిత్తుగా ఓడింది. 81 పరుగుల తేడాతో ఘోరంగా ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా.. 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్(68), రహమనుల్లా గుర్బాజ్(57) అర్థ శతకాలు సాధించగా, రింకూ సింగ్ (46) అదరగొట్టాడు. ఇక 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 17.4 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
భారీ లక్ష్య ఛేదనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాపార్డర్ విఫలమైంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ(21), డూప్లెసిస్(23) తొలి వికెట్‌కు 44 రన్స్ జోడించారు. స్పిన్నర్‌ను రంగంలోకి దింపడంతో ఆర్సీబీ వికెట్ల పతనం మొదలైంది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ డూప్లెసిస్(23)ను వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేశాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (5), హర్షల్ పటేల్(0)ను ఔట్ చేసి ఆర్సీబీని మరింత కష్టాల్లోకి నెట్టాడు. దాంతో, 19 పరుగుల వ్యవధిలో ఆర్సీబీ ఐదు వికెట్లు కోల్పోయింది. వచ్చినవాళ్లు వచ్చినట్టు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు, సుయాశ్ శర్మ మూడు వికెట్లు తీశారు. సునీల్ నరైన్ రెండు వికెట్లు పడగొట్టాడు. శార్ధూల్‌కు ఒక వికెట్ దక్కింది.