వేల పుస్తకాల మధ్య కీరవాణి , త్రివిక్రమ్, పురాణపండ !


కొన్ని అందమైన సందర్భాలు, అరుదైన విశేషాలు , అపూర్వమైన ఘటనలు ఒక్కొక్కసారి మాత్రమే మన చుట్టూ జరుగుతాయి . అవి జ్ఞాపకాలుగా మిగిలి మనకు జ్ఞాన , విజ్ఞానాల్ని ఇంజెక్ట్ చేస్తాయి. బుక్ ఫెయిర్ లో జరిగిన ఒక జ్ఞాపకమే ఇలా మనముందు అక్షరాల్లో సాక్షాత్కరిస్తుంది. స్వరమాంత్రికుడు ఎం ఎం . కీరవాణి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , పుస్తక మాంత్రికుడు పురాణపండ శ్రీనివాస్ … ఈ ముగ్గురూ ఒకే రోజు వేర్వేరు సమయాలలో హైదరాబాద్ ఎన్ఠీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శనలో వేల పుస్తకాల మధ్య ప్రత్యక్షమయ్యారు.

మొన్న ముగిసిన హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు దేశవ్యాప్తంగా వివిధ భాషల తాలూకు సుమారు మూడువందల పైచిలుకుగా స్టాల్స్ ఏర్పాటయ్యాయి. ప్రముఖ కవి , విమర్శకుడు యాకూబ్ ఈ బుక్ ఫెయిర్ కమిటీకి ఈ సంవత్సరం అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో సాహిత్య కవిత్వ వాతావరణాలకు పెద్దపీట వెయ్యడం గమనార్హం. అకస్మాత్తుగా ఒక పాఠకుడిగా సామాన్యమైన వ్యక్తిగా ఎం. ఎం . కీరవాణి పాఠకుల మధ్యకు చేరి కొన్ని పుస్తకాలను పరిశీలనగా చూడటం ఎంతోమందిని ఆకర్షించింది. అంత స్థాయిలో ఉన్నా ఎక్కడా కీరవాణిలో భేషజాలు లేవు. ఆడంబరాలు లేవు. ప్రశాంతంగా పుస్తకప్రాంగణానికి వచ్చి ప్రశాంతంగా వెళ్లిపోయారు.

ఇక ముఖ్యాంశం ఏమంటే … ప్రముఖ పాత్రికేయులు రెంటాల జయదేవ తన పాతికేళ్ల పరిశోధనను ‘ ఫస్ట్ రీల్ ‘ ప్రత్యేక గ్రంధంగా వెలువరించి … ఈ గ్రంథావిష్కరణను బుక్ ఫెయిర్ వేదికపై ఏర్పాటు చేశారు. ఈ ఫస్ట్ రీల్ స్పెషల్ బుక్ ను ఆవిష్కరించేందుకు ముఖ్య అతిధిగా హాజరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను చూసేందుకు రసజ్ఞులు, పాఠకులు ఎగబడ్డారు. పుస్తక ప్రదర్శన ప్రాంగణంలోని పలు బుక్ స్టాల్స్ ని త్రివిక్రమ్ సందర్శించారు. ఈ సందర్భంలో ప్రముఖ కవి అఫ్సర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కాస్సేపు సంభాషించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మొదటి నుండీ చివరి వరకూ ఈ కార్యక్రమంలో ఉండటం విశేషం.

మరొక ప్రధానాంశం ఏమంటే … ఈ పుస్తక ప్రదర్శనలో పదిరోజుల్లో సుమారు మూడు వేలకు పైగా బుక్స్ అమ్ముడు పోయి ‘ టాక్ అఫ్ ది బుక్ ఫెయిర్ ‘ గా నిలిచిన ‘ అదివో … అల్లదివో ‘ అపురూప గ్రంథ రచయిత , అద్భుతమైన వక్త పురాణపండ శ్రీనివాస్ ఎన్ఠీఆర్ ప్రాంగణంలోకి అడుగు పెట్టినప్పటినుండీ వెళ్లేవరకూ అక్షరయాన్ ఫౌండేషన్ మహిళా వేదిక ఇంచార్జి , ప్రముఖ రచయిత్రి అయినంపూడి లక్ష్మి టీమ్ మొదలు అచ్చంగా తెలుగు ప్రచురణలు , స్తోత్రనిధి ప్రచురణలు, సాహిత్య నికేతన్, కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణల వరకూ ఉన్న వివిధ స్టాళ్ళ నిర్వాహకులు సైతం పురాణపండ శ్రీనివాస్ తో సెల్ఫీలు తీసుకోవడం చూపరులను ఆకట్టుకుంది. అంతేకాదు పాఠకులు కూడా !

సహజంగా మానవవిలువలున్న , మానవీయ దృక్పధంతో సంచరించే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కాస్సేపు బుక్ ఫెయిర్ కమిటీ చైర్మన్ యాకూబ్ తో కవిత్వపు పరిమళాల మాటల సంభాషణ సాగించారు. అదేసమయంలో ప్రముఖ సాహితీవేత్త , ఎనభైయేళ్ల కవిత్వ స్వరూపం , తెలుగు సాహితీ వాతావరణంలో ఎందరో ఫాలోవర్లు ని సంపాదించుకున్న ప్రఖ్యాత కవి సన్నిధానం నరసింహ శర్మ రావడంతో … ఆ ప్రాంగణంలో అంతమంది మధ్య సన్నిధానం నరసింహశర్మకు పురాణపండ శ్రీనివాస్ పాదాభివందనం చేయడం పలువురిని ఆశ్చర్య పరచింది. అదీ శ్రీనివాస్ హృదయ సంస్కారమని ప్రక్కనే ఉన్న ఋషిపీఠం బుక్ స్టాల్ నిర్వాహకులు బాహాటంగానే పైకి అభినందించారు.

ఆ సమయంలో శ్రీనివాస్ ‘ అదివో … అల్లదివో ‘ గ్రంధంపై సన్నిధానం నరసింహ శర్మ పలు ప్రశంసలు వర్షించి … వాత్సల్యంతో అభినందించారు. ఈ పదిరోజుల ఉత్సవంలో ప్రముఖ రచయిత, సినీ నటులు తనికెళ్ళ భరణి ‘ ఆటకదరా శివా ‘ గ్రంధం క్రొత్త గెటప్ లో ఎంతోమందిని ఆకర్షించింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ , తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రత్యేక సలహాదారులు కె.వి . రమణాచారి ప్రోత్సాహంతో ప్రముఖ కవయిత్రి మంజులా సూర్య సమర్పించిన శివ సొగసుల ‘ శివోహం ‘ పవిత్ర గ్రంధాన్ని మరొక ప్రముఖ రచయిత్రి రోహిణి వంజారి తమ బుక్ స్టాల్ కి విచ్చేసిన కొందరు ప్రముఖులకు అందజెయ్యడం రచయిత్రుల మధ్య వుండే సౌహార్ద్రతను , సేవాభావాన్ని ప్రస్ఫుటం చేసింది. ఫేస్ బుక్ లో వేల మంది ఫాలోయర్స్ ఉన్న మంజులా సూర్య సహజంగా మంచి రచయిత్రి అయినా … పలు సినీ రచనలపై విశ్లేషణలు , సమీక్షలు రాయడం సినీ రంగానికి ఎరుకే. అయితే ఈ శివోహం చక్కని గ్రంధానికి కూడా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనకర్త కావడం విశేషం.

ఈ బుక్ ఫెయిర్ లో మరొక హైలైట్ ఏమంటే … ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘ వారాహి చలన చిత్రం ‘ ఒక ప్రత్యేక మైన హ్యాండ్ మేడ్ ఫైల్ లో శైవ వైష్ణవ శాక్తేయ గాణపత్య విశేషాలకు సంబంధించిన అద్భుతమైన నాలుగు గ్రంధాలను ఎంతో ఎంతెంతో సౌందర్యంగా … సబ్జెక్టు తో అందించి వందలాదిమందికి బహూకరించడం ఆ సంస్థ అధినేత , ఈగ వంటి ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాత , దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి ఆత్మీయుడు సాయి కొర్రపాటి భక్తి సౌజన్య హృదయానికి సంకేతంగా పలువురు ప్రముఖులు ప్రశంసించారు.ఇటీవల సాయి కొర్రపాటి శ్రీ అమృతేశ్వర ఆలయం పేరిట పరమ శివుడికి సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించడం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక పవిత్ర భావన కలిగించడం సినీ పరిశ్రమలో ఒక సెన్సషనల్ టాక్ గా నిలిచింది . ఈ బుక్ ఫెయిర్ వివిధ బుక్ స్టాల్స్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది రచయితల , సినీ ప్రముఖుల రచనలు కూడా ప్రదర్శించబడటం రసజ్ఞుల్ని విశేషంగా ఆకట్టుకుంది.