నందమూరి హరికృష్ణ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే నార్కెట్ పల్లి కామినేని ఆస్పత్రి సిబ్బంది చేసిన నిర్వాకం లేటుగా వెలుగులోకి వచ్చింది. హరికృష్ణ భౌతిక కాయంతో ఆస్పత్రి సిబ్బంది సెల్ఫీలు తీసుకోడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
అసలు ఏమి జరిగిందంటే మృత్యుముఖంలో ఉన్న వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువస్తే ఆయన సెలబ్రెటీ అని, కొనఊపిరితో ఉన్న హరికృష్ణను క్షణాల్లో లైఫ్ సపోర్టుమీద ఉంచాల్సిన సిబ్బంది సెల్ఫీలు తీసుకుంటూ కాలం గడిపిన విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ సెల్ఫీలు బయటకు రావడం కలకలం రేపుతోంది.
హరికృష్ణ భౌతిక కాయంతో ఇద్దరు డ్యూటీ నర్సులు, ఒక వార్డ్ బాయ్, వార్డ్ గర్ల్ సెల్ఫీలు దిగిన ఫోటో వైరల్ అయ్యింది. ఆయన సెలబ్రెటీ అని..ఫొటోలు దిగేంత కర్కశత్వం మనుషుల్లో పేరుకుపోయిందా? కామినేని ఆస్పత్రిలో హరికృష్ణ విషయంలో జరిగిన వ్యవహారం చూస్తే పెరిగిపోయిందని నమ్మక తప్పదు.
అంబులెన్స్ శబ్దం వినిపిస్తే రోడ్డుపై వెళ్లేవాళ్లు వీలైనంత వరకు దారి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. తాము ఎంత అర్జంట్ పనిమీద ఉన్నా పక్కకు తప్పుకుంటారు. కానీ ఆస్పత్రిలో సిబ్బంది ఏం చేస్తున్నారు. రోగి చికిత్స విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే వీఐపీ రోగులు అయితే సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. కామినేని ఆస్పత్రిలో అదే జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.