Site icon TeluguMirchi.com

Jio : రూ. 15 వేలకే రిలయన్స్ జియో కొత్త ల్యాప్‌టాప్!


టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. బడ్జెట్ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌లను కూడా తీసుకొస్తోంది. ఇప్పటికే జియో బుక్‌, జియో బుక్‌ 4జీ ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చిన జియో.. మరో కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘జియో క్లౌడ్‌ పీసీ’ని తక్కువ ధరకే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 15,000కే అందించాలని కంపెనీ భావిస్తోందట. ప్రస్తుతం మార్కెట్లో ల్యాప్‌టాప్‌ ధర కనీసం రూ. 35-50 వేలు పలుకుతున్న సంగతి తెలిసిందే.

జియో క్లౌడ్‌ పీసీకి సంబందించి ప్రముఖ ల్యాప్‌టాప్‌ తయారీ సంస్థలైన హెచ్‌పీ, లెనోవా, ఏసర్‌లతో రిలయన్స్ జియో చర్చలు జరుపుతోందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జియో క్లౌడ్‌ పీసీ కేవలం ఒక యాక్సెస్‌ డివైజ్‌ లానే పనిచేస్తుంది. ల్యాప్‌టాప్‌ను యూజర్ ఉపయోగిస్తున్నప్పుడు జరిగే ప్రాసెస్‌ మొత్తం బ్యాక్‌గ్రౌండ్‌లో జియో క్లౌడ్‌లో జరుగుతుంది. దాంతో యూజర్లు తక్కువ ధరకే వేగవంతమైన క్లౌడ్‌ సర్వీసులు పొందొచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పరీక్షలను హెచ్‌పీ క్రోమ్‌ బుక్‌లో చేస్తున్నారు.

జియో క్లౌడ్‌ పీసీ కోసం నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లను రిలయన్స్ జియో సిద్ధం చేస్తుంది. యూజర్లు ల్యాప్‌టాప్‌ వద్దనుకుంటే.. జియో క్లౌడ్‌ పీసీ సాఫ్ట్‌వేర్‌ను తమ కంప్యూటర్‌, స్మార్ట్‌టీవీల్లో ఇన్‌స్టాల్‌ చేసుకుని కంప్యూటింగ్ సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా అదనంగా మరిన్ని సర్వీస్‌లను యూజర్లకు కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది.

Exit mobile version