40 సంవత్సరాల పాటు దేశానికి సేవలందించిన భారతీయ నావికా దళానికి చెందిన హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్, దేశీయంగా రూపకల్పన చేసి నిర్మించిన ఐఎన్‌ఎస్ సంధాయక్ నౌకకు జూన్ 04, శుక్రవారం నాడు శాశ్వతంగా విరామం ఇవ్వనున్నారు. ఐఎన్ఎస్ సంధాయక్ డీకమిషన్ కార్యక్రమం నావల్ డాక్యార్డ్ విశాఖపట్నంలో జరుగుతుంది. కోవిడ్ ప్రోటోకాల్లను కఠినంగా పాటిస్తూ స్టేషన్ అధికారులు మరియు నావికులు మాత్రమే హాజరై నిరాడంబరంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
సంధాయక్‌ను అప్పటి చీఫ్ హైడ్రోగ్రాఫర్ రియర్ అడ్మిరల్ ఎఫ్ఎల్ ఫ్రేజర్, ఎవిఎస్ఎమ్, పద్మశ్రీ నేతృత్వంలో రూపకల్పన జరిగింది. ఆయనకు భారతదేశంలో స్వదేశీ రూపకల్పనలో హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌకను నిర్మించాలనే బలమైన కోరిక ఉండేది. ఈ డిజైన్ ను నావల్ హెడ్ క్వార్టర్స్ రూపొందించగా ఓడ నిర్మాణం 1978 లో జిఆర్ఎస్ఇ కోల్‌కతా (అప్పటి కలకత్తా) వద్ద ప్రారంభమైంది. ఈ నౌకను 26 ఫిబ్రవరి 1981 న భారత నావికా దళంలోకి అప్పటి తూర్పు నావికా దళం (ఈఎన్సి) ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ అడ్మిరల్ ఎంకె రాయ్, ఎవిఎస్ఎమ్ ప్రవేశపెట్టారు. భారత నావికాదళంలోని హైడ్రోగ్రాఫర్‌లు ఈ నౌక నుండి అనేక పాఠాలను నేర్చుకున్నారు. తద్వారా ద్వీపకల్ప జలాల పూర్తి హైడ్రోగ్రాఫిక్ కవరేజీకి పునాది వేసింది. అలాగే, విజయవంతమైన ఆ నౌక డిజైన్ భారత నావికాదళంలోని అన్ని సర్వే నౌకలకు ఇటీవలి వరకు వివిధ మార్పులు చేయడానికి మార్గం సుగమం చేసింది.
ఈ నౌక దేశంలోని తూర్పు, పశ్చిమ తీరాలు, అండమాన్ సముద్ర జలాలు, పొరుగు దేశాలలో కూడా సుమారు 200 ప్రధాన హైడ్రోగ్రాఫిక్ సర్వేలు, అనేక చిన్న సర్వేలను చేపట్టింది. సర్వే మిషన్లు మాత్రమే కాకుండా, ఆపరేషన్ పవన్ – 1987 లో శ్రీలంకలో భారత శాంతి పరిరక్షక దళానికి సహాయం చేయడం, ఆపరేషన్ సరోంగ్, ఆపరేషన్ రెయిన్బో – 2004 లో సునామి తరువాత మానవతా సహాయం అందించడం మరియు తొలిసారిగా పాల్గొనడం వంటి అనేక ముఖ్యమైన కార్యకలాపాలలో ఈ నౌక చురుకుగా పాల్గొంది. ‘టైగర్-ట్రయంఫ్’ పేరుతో ఇండో-అమెరికా ఉమ్మడి నౌకా విన్యాసంలో కూడా ఈ నౌక పాల్గొంది.
తన అద్భుతమైన 40 సంవత్సరాల ప్రస్థానంలో 22 కమాండింగ్ అధికారులు మారారు. చివరి కమాండింగ్ ఆఫీసర్ 17 జూన్ 19 న నౌక బాధ్యతలు స్వీకరించారు. ఐఎన్ఎస్ సేవలు ఇక ముగిసాయి అనడానికి ప్రతీకగా శుక్రవారం సూర్యాస్తమయంలో ఆ నౌక వేదికగా నావల్ జెండా, కమీషనింగ్ పతాకాన్ని చివరిసారి అవనతం చేస్తారు. ఈఎన్ సి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్, ఎవిఎస్ఎమ్, విఎస్ఎమ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.