Site icon TeluguMirchi.com

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రంగంలోకి దిగిన భారత వైమానిక దళం

కోవిడ్-19ని కట్టడి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దేశం వివిధ ప్రాంతాలలో అవసరమైన ప్రాంతాలకు  ఆక్సిజన్ కంటైనర్లు, సిలిండర్లు, అత్యవసర మందులు, పరికరాలను చేర్చడానికి వైమానిక దళం తన యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. వైమానిక దళ రవాణా విమానాలు, హెలికాఫ్టర్లను దీనికోసం ఉపయోగిస్తున్నారు. సి -17, సి -130 జె, ఐఎల్ -76, అన్ -32 , అవ్రో రవాణా విమానాలు దేశం వివిధ ప్రాంతాల నుంచి అవసరమైన ప్రాంతాలకు సిలిండర్లు,  అత్యవసర మందులు, పరికరాలను చేరుస్తున్నాయి. అవసరమైతే వినియోగించడానికి చినూక్ మరియు మి -17 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. కొచ్చి, ముంబై, వైజాగ్ మరియు బెంగళూరుల నుంచి వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బందిని తన విమానాల్లో వైమానిక దళం ఢిల్లీలోని వివిధ ఆసుపత్రులకు తీసుకొని వస్తోంది. 

భారత వైమానిక దళానికి చెందిన  సి -17,  ఐఎల్ -76 విమానాలు  పెద్ద ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లను వాటిని ఉపయోగిస్తున్న ప్రాంతాల్లో నుంచి వాటిలో ఆక్సిజన్ నింపడానికి సౌకర్యం వున్న ప్రాంతాలకు తీసుకుని వెళ్తున్నాయి. అత్యవసరమైన ఆక్సిజన్ ను వేగంగా సరఫరా చేయడానికి ఈ చర్య ఉపయోగపడుతోంది. దీనితో పాటు  సి -17,  ఐఎల్ -76 విమానాలు లేహ్ వద్ద అదనపు కోవిడ్ పరీక్షా సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బయో సేఫ్టీ క్యాబినెట్లు, ఆటోక్లేవ్ మెషీన్లను పెద్ద సంఖ్యలో రవాణా చేశాయి.అతి తక్కువ సమయంలో రంగంలోకి దిగడానికి హెలికాఫ్టర్లను సంసిద్ధంగా ఉంచారు. 

కొవిడ్-19 వ్యాప్తి ప్రారంభ రోజులలో కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి అవసరమైన మందులు, వైద్య మరియు ఇతర అవసరమైన సామాగ్రిని పంపిణీ చేయడానికి భారత వైమానిక దళం  అనేక చర్యలను అమలు చేయడంతో పాటు విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను దేశానికి తీసుకుని రావడానికి సహకరించింది. 

Exit mobile version