అమెరికా వీసాల పునరుద్ధరణ ఇంటర్వ్యూలకు వ్యక్తిగత హాజరు మినహాయింపును మరిన్ని విభాగాలకు విస్తరింపచేయనున్నట్టు హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న విభాగాలతో బాటు పర్యాటక / వ్యాపార, డిపెండెంట్, ట్రాన్సిట్, క్రూ వంటి విభాగాల కిందికి వచ్చేవారికి ఇక నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంటుందని కాన్సులేట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటిదాకా వీసా వున్నవారు తమ వీసాలను పునరుద్దరించుకోవాలంటే వీసా అధికారి వద్ద వ్యక్తిగతంగా హాజరు కావల్సివుండేది. భారత్ నుంచి అమెరికా వెళుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా ఈ ఏడాది మార్చ్ నుంచి కొన్ని విభాగాలకు వ్యక్తిగత మినహాయింపునిస్తూ కాన్సులేట్ నిర్ణయం గైకొంది. ఇప్పుడు ఆ నిర్ణయం కొనసాగింపుగా మరిన్ని విభాగాలకు వ్యక్తిగత హాజరును మినహాయిస్తూ కాన్సులేట్ ఉత్తర్వులు జారి చేసింది.