దేశంలోనే మొట్టమొదటి సారిగా నిర్మించనున్న సముద్ర గర్భ సొరంగం నిర్మాణానికి సంబంధించి మళ్లీ కదలిక వచ్చింది. ముంబయి-అహ్మదాబాద్ మధ్య నిర్మించనున్న హైస్పీడ్ రైల్ కారిడార్ పనులకు నేషనల్ హైస్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) బిడ్లను ఆహ్వానించింది. హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా 21 కిలోమీటర్ల మేర సొరంగాన్ని తవ్వనున్నారు. ఇందులో 7 కిలోమీటర్లు సముద్రగర్భంలో తవ్వాల్సి ఉంది. మహారాష్ట్రలోని బంద్రా-కుర్లా కాంప్లెక్స్ మధ్య సాధారణ సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా.. థానే జిల్లాలోని శిల్‌ఫాటా ప్రాంతంలో సముద్రంలో నిర్మించాల్సి ఉంది. న్యూ ఆస్ట్రియన్ టన్నెల్ విధానం (ఎన్‌ఏటీఎమ్)లో సొరంగాన్ని నిర్మించనున్నారు. ముంబయి నుంచి అహ్మదాబాద్ మధ్య చేపడుతోన్న ఈ రైలు కారిడార్ మొత్తం పొడవు 508.17 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ నుంచి ముంబయి కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు.