ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు జీపీఎస్ ఆధారిత స్మార్ట్ వాచీలు ఇవ్వాలని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల హాజరు కోసం ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని పూర్తిగా ఎత్తేసి స్మార్ట్ వాచీల ద్వారా వారి హాజరు.. విధుల నిర్వహణ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సోహ్నాలోని సర్మత్లా గ్రామంలో ‘వికాస్’ ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు ఈ ప్రకటన చేశారు. “రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులందరూ స్మార్ట్ వాచీలను ధరిస్తారు, కార్యాలయ సమయాల్లో వారి కదలికలను ట్రాక్ చేస్తుంది, అలాగే హాజరును ప్రామాణికంగా గుర్తించడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు
కరోనా సమయంలో బయో మెట్రిక్ మెషిన్లను వాడటం మానేశారని, స్మార్ట్ వాచీలు ఇచ్చాక వాటిని తొలగిస్తామని ఖట్టర్ చెప్పారు. హాజరును తారుమారు చేసే లొసుగులను ఈ స్మార్ట్ వాచ్ తొలగిస్తుందని సీఎం ఖట్టర్ తెలిపారు. ఈ కొత్త వ్యవస్థ ప్రభుత్వ కార్యకలాపాలలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతుందని అన్నారు. తాము ప్రవేశపెట్టే ఈ స్మార్ట్ వాచ్, సంబంధిత అధికారిని మాత్రమే ట్రాక్ చేస్తుందని, వేరెవరైనా ధరించినట్లయితే గడియారం పనిచేయడం ఆగిపోతుందని ఆయన చెప్పారు. మరోవైపు స్మార్ట్ వాచ్ హాజరు విధానాన్ని ప్రస్తుతం పంచకుల మున్సిపల్ కార్పొరేషన్, చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్‌లో అమలు చేస్తున్నారు.