వరదల వల్ల నష్టపోయిన కేరళని ఆదుకోవాడానికి ప్రపంచ వ్యాప్తంగా విరాళాలు వస్తున్నాయి. జల విలయంతో అతలాకుతలమైన కేరళకు సినిమా ఇండస్ట్రీస్, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కేరళ వరద బాధితుల పట్ల తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. జల విలయం వల్ల రహదారులు, ఇళ్లు కొట్టుకుపోయాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు.
ఇప్పుడు కేరళను ఆదుకోవడానికి సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ముందుకొచ్చింది. గూగుల్.ఓఆర్‌జీ, గూగులర్స్ కలిసి కేరళ సహాయక చర్యల కోసం మిలియన్ డాలర్లు ఇవ్వాలని నిర్ణయించారు అని గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్‌లో పాల్గొన్న ఆ సంస్థ ఆగ్నేయాసియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ ఈ రోజు తెలిపారు. అంటే సుమారు రూ.7 కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి గూగుల్ క్రైసిస్ రెస్పాన్స్ టీమ్ పలు రకాల చర్యలను చేపట్టింది. వరదల సమయంలో గూగుల్ కేరళలో పర్సన్ ఫైండర్ టూల్‌ను యాక్టివేట్ చేసింది. దీనిద్వారా 22 వేల మంది సమాచారం తెలిసింది. ఈ వరదల కారణంగా కేరళకు సుమారు 20 వేల కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా.