భారత్, శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని ఈదిన హైద్రాబాద్ కి చెందిన తొలి తెలుగు మహిళగా గోలి శ్యామల ప్రపంచ రికార్డు సృష్టించారు. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ జలసంధిని శ్యామల 13 గంటల 43 నిమిషాల్లోనే ఈది శబాష్ అనిపించారు. శ్రీలంక తీరం నుంచి శుక్రవారం ఉదయం 4.15 గంటలకు బయల్దేరిన ఆమె సాయంత్రం 5.58 గంటలకు రామేశ్వరంలోని ధనుష్‌కోటి చేరుకున్నారు. ఇంతకుముందు ఈ జలసంధిని 12 గంటల 30 నిమిషాల్లోనే ఈదిన ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది దగ్గర శ్యామల శిక్షణ తీసుకోవం విశేషం, ఆయనే శ్యామలకు ఈతలో మెళకువలు నేర్పి, మెరుగైన శిక్షణ ఇప్పించారు. కాగా, పాక్ జలసంధిని ఈదిన ప్రపంచంలోనే రెండో మహిళ శ్యామల కావడం విశేషం.