కొన్ని రోజుల పాటు చికెన్ తినకండి..

మొన్న కరోనా , నిన్న స్ట్రెయిన్‌ కరోనా , ఇప్పుడు బర్డ్‌ప్లూ ఇలా నిత్యం ఏదో ఒక వైరస్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు బయటకు తిరగకుండా చేసిన కరోనా..ఇప్పుడు చికెన్ కూడా తినకుండా చేసింది బర్డ్‌ప్లూ అనే వైరస్.

భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. దీంతో వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న బర్డ్ వైరస్ మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బయటపడింది. ఈ వైరస్ క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే పెద్ద భారీ సంఖ్యలో కోళ్లు, కాకులు, బాతులు, నెమళ్లుకూడా ఈ వైరస్ కు గురై మృత్యువాతపడుతున్నాయి.

హర్యానాలో గత పది రోజుల్లో 4 లక్షలకు పైగా పౌల్ట్రీ కోళ్లు చనిపోపోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఒక్క పంచకుల జిల్లాలోనే నాలుగు లక్షలకు పైగా కోళ్లు మరణించటంతో పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ కోళ్ల ద్వారా మనుషులకు వచ్చే ఛాన్స్‌ ఎక్కువగా ఉంది. ఈ వైరస్‌ కోళ్లకు సోకినప్పుడు రెండు రకాల లక్షణాలు కన్పిస్తాయి. ఈ వైరస్ తీవ్రత తక్కువగా ఉంటె.. కోళ్ల ఈకలు రాలిపోవడంతో పాటు, గుడ్డు ఉత్పత్తి కూడా తగ్గుతుంది. అదే ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైతే.. కోడి శరీరంలోని వివిధ అవయవాలు దెబ్బతిని 48 గంటలోపు మరణిస్తుంది. కోడి విసర్జన ద్వారా ఈ వ్యాధి ఒక దాని నుంచి మరొక కోడికి త్వరగా వ్యాప్తిచెందుతుంది. ఈ వైరస్‌ వ్యాప్తికి వివిధ పక్షులు వాహకాలుగా పనిచేస్తాయి. పక్షుల నుంచి కూడా ఈ వైరస్‌ మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అందుకే డాక్టర్స్ కొన్ని రోజుల పాటు చికెన్ తినకుండా ఉంటె మంచిదని చెపుతున్నారు.