మాజీ ఎంపీ కుమారుడు తుపాకీతో వీరంగం


బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)కి చెందిన ఓ మాజీ ఎంపీ కుమారుడు తుపాకీ పట్టుకుని ఓ మహిళను బెదిరిస్తూ హల్‌చల్ సృష్టించాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ వద్ద బీఎస్పీ మాజీ ఎంపీ రాకేష్ పాండే కుమారుడు ఆశిష్ పాండే పిస్తోల్‌తో ఓ జంట పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ, వారితో వాగ్వాదానికి దిగినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఆశిష్‌తో ఉన్న మరో మహిళ అతడిని అడ్డుకొనేందుకు ప్రయత్నించింది. ఆశిష్‌ ఆ మహిళను బెదిరిస్తూ, తిడుతూ ఉండడంతో వీడియోలో కనిపించింది.

హోటల్‌ సిబ్బంది కూడా అతడిని అక్కడి నుంచే పంపించే ప్రయత్నం చేసినట్లు వీడియోలో రికార్డైంది. ఆదివారం రాత్రి ఓ పార్టీ అయిపోయిన తర్వాత హోటల్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. 11 సెకన్ల నిడివి గల ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఢిల్లీ పోలీసులు బీఎస్పీ మాజీ ఎంపీ రాకేశ్ పాండే కుమారుడు ఆశిష్ పాండేపై కేసు నమోదు చేశారు. ఆదివారం బహిరంగంగా తుపాకీతో బెదిరించిన ఆశిష్ పాండేపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు.. అతడిని అరెస్ట్‌ చేయనున్నట్లు ఢిల్లీ స్పెషల్ జాయింట్ సీపీ వెల్లడించారు.