క్రికెట్ సంచలనం ఆస్ట్రేలియా ఇంటికే…ఫైనల్ కి చేరిన ఇంగ్లాండ్

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ జట్లు ఏవో నిన్నటి ఆసీస్-ఇంగ్లాండ్ మ్యాచ్ తో తేలిపోయాయి. మొదటి సెమీ ఫైనల్లో గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే ఫైనల్‌కి చేరుకోగా ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ జట్టు కూడా ఫైనల్లో అడుగుపెట్టింది.

ఇక లార్డ్స్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్‌ జరగనుండగా సుదీర్ఘ ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లూ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా వరల్డ్‌కప్ గెలవలేదు. అలాంటిది రెండూ జట్లు ఫైనల్ కి వెళ్ళడం ఆసక్తికరంగా మారింది. నిన్న మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49 ఓవర్లలోనే 223 పరుగులకి ఆలౌటైంది.

224 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు ఎక్కడా ఇబ్బంది పడలేదు. 32.1 ఓవర్లలోనే 226/2తో అలవోకగా పూర్తి గెలిచేసింది. ఇరుజట్లలో ఎవరు కప్ గెలిచినా అది చరిత్ర అవుతుంది. ఎందుకంటే, ఇంగ్లాండ్ క్రికెట్ కు పుట్టినిల్లు అయినా ఇంతవరకు 50 ఓవర్ల ఫార్మాట్ లో ప్రపంచకప్ గెలిచింది లేదు. మరోవైపు, న్యూజిలాండ్ ఇప్పటికి ఎనిమిదిసార్లు సెమీస్ ఆడి, రెండు పర్యాయాలు ఫైనల్ చేరింది. చూడాలి ఈసారి లక్ ఎవరిని వరించనుందో ?