హైదరాబాద్ డాగ్ లవర్స్‌కి శుభవార్త


ఇప్పటి వరకు మనము తిరిగే పార్క్ లను మాత్రమే చూసాం. అయితే సాధారణ పార్కుల్లోకి మనతో పాటు శునకాలను తీసుకెళ్లడం నిషేధం కాబట్టి, శునకాల కోసం ప్రత్యేకంగా ఓ పార్కు సిద్ధమైంది. విదేశాల్లో మాత్రమే కనిపించే ఈ తరహా పార్కులను మన దేశంలో తొలిసారి అదీ మన హైదరాబాద్‌లో నిర్మించడం విశేషం.

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, వెస్ట్ జోన్ జోనల్ కమీషనర్ హరిచందన దాసరి మాట్లాడుతూ, “రూ.1.1 కోట్ల ఖర్చుతో డంపింగ్ యార్డును శునకాల పార్కుగా మార్చాము. ఇది దేశంలో తొలి శునకాల పార్కు. త్వరలోనే ఈ పార్కు ప్రారంభమవుతుంది.’ అని, అయితే.. ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంకా తేదీ నిర్ణయించలేదని ఆమె పేర్కొన్నారు. ఈ పార్కులో చిన్న, పెద్ద శునకాలకు శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. స్ప్లాష్ పూల్, ఓ ఆంఫీథియేటర్, లూ కేఫ్‌లు కూడా ఈ పార్కులో ఉన్నాయి.

ఇది కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియాచే కూడా సర్టిఫికేట్ పొందింది. ఇక్కడి డాగ్ క్లినిక్‌లో వైద్యులు అందుబాటులో ఉంటారు. శునకాల కోసం ఉపయోగించే సామాగ్రి కూడా దొరుకుతుందిక్కడ. “పార్కు తెరిచిన తరువాత పెంపుడు శునకాల యజమానులు వారి శునకాలకు పార్కులో శిక్షణ ఇప్పించవచ్చు” అని దాసరి చెప్పారు. గతేడాది నుంచి ఈ పార్కు కోసం మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది కష్టపడ్డారు.