15 వేల వాహనంకు రూ.23 వేల జరిమానా

దేశ వ్యాప్తంగా కొత్త వాహన చట్టం ద్వారా వసూళ్లు చేస్తున్న జరిమానాలు వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా ఎంతో కఠినంగా కొత్త చట్టంను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురుగ్రామ్‌లో జరిగిన ఒక సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అంతా కూడా ఈ విషయమై చర్చించుకుంటూ జోకులు వేసుకుంటున్నారు. కొత్త చట్టంలో ఉన్న అన్ని జరిమానాలు ఒక వ్యక్తి డ్రైవ్‌ చేస్తున్న స్కూటర్‌కు విధించడం జరిగింది. దాంతో ఏకంగా ఆ మొత్తం 23 వేల రూపాయలు అయ్యింది.

ఆ బండి ఖరీదు 15 వేలకు మించి ఉండదు. ఎందుకంటే అది చాలా ఓల్డ్‌ మోడల్‌ అవ్వడంతో పాటు సరైన కండీషన్‌లో కూడా లేదు. దాంతో ఆ బండికి వేసిన 23 వేల ఫైన్‌ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. హెల్మెట్‌ లేకపోవడంతో రూ. 1000, లైసెన్స్‌ లేకపోవడంతో రూ. 5000, సరైన పత్రాలు లేనందుకు రూ.5000, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేనందుకు రూ. 10 వేలు, ఇన్సూరెన్స్‌ లేనందుకు రూ.2000 మొత్తంగా 23 వేల రూపాయలను చెల్లించాలంటూ బండిని దగ్గర పెట్టుకున్నారు. తన బండి ఖరీదు 15 వేలు అని అంతటి మొత్తంను నేను ఎలా కడతానంటూ అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.