కోవిడ్ నుంచి కోలుకున్నవారు వ్యాక్సినేషన్ను 3 నెలల తర్వాతకి వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజా మార్గదర్శకాల్లో సూచించింది. వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్కి సంబందించిన జాతీయ నిపుణుల బృందం ఇందుకు సంబంధించి తాజా సిఫారసులు చేసింది. ఆరోగ్యమంత్రిత్వశాఖ ఈసిఫార్సులను ఆమోదించింది
కరోనా వచ్చినట్లుగా ల్యాబ్ టెస్టు ద్వారా నిర్ధారణ జరిగినవారు కోలుకున్న తర్వాత 3 నెలల వరకు వ్యాక్సిన్ తీసుకోరాదని మంత్రిత్వ శాఖ సూచించింది. ప్లాస్మా చికిత్స పొందినవారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి 3 నెలల తర్వాత తమ వ్యాక్సినేషన్ వాయిదా వేసుకోవాలని సిఫార్సు చేసింది.
మొదటి డోస్ తరవాత కరోనా పాజిటివ్ అయిన వ్యక్తి 2వ డోస్ను కోలుకున్నతరవాత 3నెలలకి వాయిదా వేయాలని కూడా సిఫార్సు చేశారు. ఇంకేవన్నా వ్యాధులు లేదా తీవ్రమైన అస్వస్థత కారణంగా హాస్పిటల్ లో చేరడం లేదా ఐసీయూలో చికిత్స పొందేవారు కూడా కరోనావ్యాక్సిన్ పొందేందుకు 4 నుంచి 8 వారాల పాటు వేచి ఉండాలి.
కరోనా వ్యాక్సిన్ పొందిన తరువాత లేదా ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగిటివ్ వచ్చిన అనంతరం ఒక వ్యక్తి 14 రోజుల తరవాత రక్తదానం చేయవచ్చునని, కరోనా వాక్సినేషన్ పిల్లలకు పాలిచ్చే తల్లులకు కూడా ఇవ్వవచ్చునని అయితే గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్ ఇచ్చే విషయం ఇంకా పరిశీలనలో ఉన్నట్లు తెలియజేసింది.
వాక్సినేషన్కు ముందు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయవలసిన అవసరం లేదని కూడా బృందం పేర్కొంది. ఈ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని అవసరమైన విధంగా అమలు చేసేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ర్టాలకు లేఖ రాసింది. ఇందుకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా సూచించారు. అన్ని స్థాయిల్లో వ్యాక్సినేషన్ జరిపే సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కూడా రాష్ట్రాలను కోరారు.