ఏపీలో పెరుగుతున్న కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం, కాకినాడలో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాకినాడలో 49 ఏళ్ల వ్యక్తికి, రాజమహేంద్రవరంలో 72 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకినట్లు చెప్పారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 23కి చేరింది

ఇదీలావుంటే కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వైద్య విభాగాలు మొత్తం ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తూ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ పరిధిలోకి ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోని సేవలు కూడా రానున్నాయి. రోగ నిర్ధారణ పరీక్షలు, ఇన్‌పేషంట్‌ సేవలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. అన్ని వైద్య సంస్థలను కరోనా చికిత్సకు వినియోగించుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటిలేటర్స్‌, ల్యాబ్స్‌, వైద్యులు, నాన్‌ మెడికల్‌ సిబ్బంది సేవలు ప్రభుత్వం పరిధిలోకి రానున్నాయి.