పచ్చని మొక్క ప్రణవాయువుని ఇస్తుంది. కాలుష్యం నుంచి మనిషిని కాపాడుతుంది. నిరంతర కాలుష్యంతో ప్రమాదపుటంచును తాకుతున్న మానవాళిని జాగృతం చేయడమే ధ్యేయంగా పలు అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఉద్యమమే హరితహారం. రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేయడమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న మార్గమిది. మొక్కలు నాటడమే దీని ఉద్ధేశ్యం. ఇందుకు మేము సైతం అంటూ పలువురు సినీతారలు ముందుకొచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి సైతం తనవంతు బాధ్యతగా ‘హరితహారం’ ఛాలెంజ్‌ని స్వీకరించారు. అన్నయ్య తన ఇంటి పెరట్లో మొక్కలు నాటి హరితహారం ఉద్యమానికి నేను సైతం అంటూ బాసటగా నిలిచారు. మెగాస్టార్ స్వయంగా మొక్కను నాటి, దానికి నీళ్లు పోస్తున్న ఫోటోల్ని ప్రస్తుతం మెగాభిమానులంతా షేర్ చేస్తూ ఎవరికి వారు హరితహారం చేపట్టాలని ఉద్యమిస్తున్నారు. మంచి కోసం మేము సైతం అంటూ మెగాభిమానులు కదిలొస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు పచ్చదనంతో కళకళలాడాలన్నదే అన్నయ్య చిరంజీవి ధ్యేయం. అందుకే ఆయన అభిమానులకు ఓ వీడియో సందేశం ఇచ్చారు. మా ఇంటి పెరట్లో మూడు మొక్కలు నాటాను. ఇంత మంచి పనికి స్ఫూర్తినిచ్చిన మిత్రులందరికి ధన్యవాదాలు అన్నారు. తాను ఈ మంచి పని చేయడమే గాక.. మరో ముగ్గురిని హరితహారం ఛాలెంజ్‌కి నామినేట్ చేశారు. బిగ్‌బి అమితాబ్ బచ్చన్, మీడియా లెజెండ్ రామోజీరావు, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌లను హరితహారానికి ఆహ్వానించారు. ఓవైపు సైరా షూటింగులో బిజీగా ఉండీ కొంత సమయాన్ని అన్నయ్య ఇలా హరితహారం కార్యక్రమానికి కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.