పెరుగుతున్న కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వివిధ స్థాయిలలో జరగబోయే పరీక్షలను సమీక్షించడానికి గౌరవ ప్రధాన మంత్రి బుధవారం ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, ప్రధాన మంత్రి ప్రధాన కార్యదర్శి, క్యాబినెట్ కార్యదర్శి, పాఠశాల మరియు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శులు మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
విద్యార్థుల శ్రేయస్సుకి అధిక ప్రాధాన్యతనివ్వాలని ప్రధాని పునరుద్ఘాటించారు. కేంద్రం విద్యార్థుల ఉత్తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేలా తగు చర్యలు చేపడుతుందని, అదే సమయంలో వారి విద్యా ప్రయోజనాలకు హాని జరగదని ఆయన పేర్కొన్నారు.
వచ్చే నెల నుండి జరగబోయే 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షపై అధికారులు వివరించారు. సిబిఎస్ఇ నిర్వహించే పదవ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలు 2021 మే 4 నుండి ప్రారంభం కానున్నాయి. అయితే దేశంలో మహమ్మారి పరిస్థితి అనేక రాష్ట్రాల్లో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు తిరిగి పుంజుకోవడంతో కొన్ని రాష్ట్రాలు ఇతరులకన్నా ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితిలో 11 రాష్ట్రాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. స్టేట్ బోర్డ్‌ల మాదిరిగా కాకుండా, సిబిఎస్‌ఇకి అఖిల భారత పాత్ర ఉంది, అందువల్ల, దేశవ్యాప్తంగా ఒకేసారి పరీక్షలు నిర్వహించడం చాలా అవసరం. మహమ్మారి మరియు పాఠశాల మూసివేత ప్రస్తుత పరిస్థితిని చూస్తే, విద్యార్థుల భద్రత మరియు శ్రేయస్సును కూడా పరిగణనలోకి తీసుకొని ఈ కింద విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది :
- పన్నెండవ తరగతికి సంబంధించిన బోర్డు పరీక్షలు మే 4 వ తేదీ నుండి జూన్ 14, 2021 వరకు జరగాల్సి ఉండగా అవి వాయిదా పడతాయి. తదుపరి పరీక్షల తేదీలను జూన్ 1, 2021 న బోర్డు సమీక్షిస్తుంది. పరీక్షలు ప్రారంభమయ్యే ముందు కనీసం 15 రోజుల నోటీసు ఇవ్వడం జరుగుతుంది.
- 2021 మే 4వ తేదీ నుండి జూన్ 14 వరకు జరగబోయే పదవ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయడం జరిగింది. పదవ తరగతి బోర్డు ఫలితాలు బోర్డు అభివృద్ధి చేయాల్సిన ఆబ్జెక్టివ్ ప్రమాణం ఆధారంగా తయారు చేయబడతాయి. ఈ ప్రాతిపదికన అతనికి / ఆమెకు కేటాయించిన మార్కులతో సంతృప్తి చెందని అభ్యర్థికి పరీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, పరీక్షలో కూర్చునే అవకాశం కల్పిస్తారు.