ఏపీలో కరోనా మరో రకంగా కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లాలో హోంక్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి ప్రమాదవశాత్తు కత్తి గుచ్చుకోవడంతో మృతి చెందాడు. ఈ ఘటన చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(56) గత 13రోజులుగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భార్యతో కలిసి హోంక్వారంటైన్‌లో ఉంటున్నాడు. ఈ రోజు ఇతను ఇంట్లో కూరగాయలు కోస్తున్నాడు. వంటింట్లోకి వెళ్లి వచ్చిన క్రమంలో అతడు కాలుజారి కింద పడిపోవడంతో కత్తి గుండె పైభాగంలో గుచ్చుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే ఉన్న పోలీసులు, ఏఎన్‌ఎంలు ప్రాథమిక చికిత్స చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ రక్తస్రావం ఆగకపోవడంతో 108కు సమాచారం అందజేశారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు.