ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ భారత్‌లోనూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1637కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 38మంది మరణించగా 1466 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. కేవలం గత 12గంటల్లోనే దేశవ్యాప్తంగా 240కరోనా పాజిటీవ్ కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇదీలావుంటే దేశరాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమానికి హాజరైన వారిలో 24 మందికి కరోనా వైరస్ (కొవిడ్-19) పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమ నిర్వాహకులైన మౌలానా సాద్ తదితరులపై ‘అంటువ్యాధుల చట్టం 1897’ ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు దిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్.ఎన్. శ్రీవాత్సవ తెలిపారు. అంతేకాకుండా ఈ మర్కాజ్‌కు హాజరైన 12 మంది విదేశీయులు సమాచారాన్ని దాచి ఉంచినందుకు జామా మసీదు వజీరాబాద్ ఇమామ్‌పై కూడా కేసు నమోదు చేశారు.