అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో కాన్సర్ పై అవగాహన కార్యక్రమం

డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘క్యాన్సర్ పై అవగాహన మరియు స్క్రీనింగ్ క్యాంప్” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగాప్రముఖ వైద్యురాలు, ఎం. ఎన్. జె. క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ డా.జయలత పాల్గొని కీలకోపన్యాసం చేశారు ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై భయం కంటే అవగాహన చాలా ముఖ్యం అని, మొదట దశలోనే గుర్తిస్తే 95 శాతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నయం చేయవచ్చు అన్నారు. పొగాకు, తంబాకు, గుట్కా, పాన్ పరాగ్, జర్ధా నమలడం ధూమపానం, వంటి వాటి వల్ల గ్రామీణ యువత ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎలాంటి లక్షణాలు లేకున్నా తప్పకుండా ప్రతీ సంవత్సరం పరీక్షలు చేపించుకోవాలని, మహిళల్లో ముఖ్యంగా విద్యార్థి దశలోనే రొమ్ము క్యాన్సర్ పై అవగాహన చాలా అవసరం అన్నారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అతిధిగా పాల్గొన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ.కె. సీతారామారావు మాట్లాడుతూ మారిన ఆధునిక పరిస్థితుల్లో విజ్ఞాన, వైద్య శాస్త్రంలో అనేక మార్పులు వస్తున్నాయని వాటిని గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విజ్ఞాన, వైద్య శాస్త్రాల పైన అవగాహన కార్యక్రమాలు చేపట్టి తద్వారా ప్రజల్లో అవగాహన కలిగే విధంగా మరింత ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. సుధారాణి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో క్యాన్సర్ పట్ల మరింత అవగాహన అవసరం అన్నారు. వైద్యం అంటే భయపడే పరిస్థితి నుంచి, అవగాహన ద్వారా వ్యాధి పైన విజయం సాధించొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి కో ఆర్డినేటర్ గా వ్యవహరించిన సైన్స్ విభాగ డీన్ ప్రొ. పుష్పా చక్రపాణి మాట్లాడుతూ కార్యక్రమ నిర్వహణా ఆవశ్యకతను వివరించారు. సైన్స్ విభాగం ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో సమాజానికి, ఉద్యోగులకు, విద్యార్థులకు ఉపయోగపడేలా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో పలు విభాగాల డైరెక్టర్స్ ప్రొ. ఘంటా చక్రపాణి, డా.బానోత్ లాల్, ప్రొ. మధుసూదన్ రెడ్డి, డా.ఏ.వి.ఎన్. రెడ్డి, వద్దానం శ్రీనివాస్, గుంటి రవి, పలువురు డీన్స్, విశ్వవిద్యాలయం మాజీ అధ్యాపకులు ప్రో.ఎస్. వి.రాజశేఖర్ రెడ్డి అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఎం. ఎన్. జె. క్యాన్సర్ ఆస్పత్రి సిబ్బంది విశ్వవిద్యాలయం ఉద్యోగులు, విద్యార్థినులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.