Site icon TeluguMirchi.com

రైళ్లలో కూడా బ్లాక్‌ బాక్స్‌!


బ్లాక్‌ బాక్స్‌ ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది విమానాలు. ఎందుకంటే విమానాలు క్రాష్ అయినప్పుడు బ్లాక్‌ బాక్స్‌ అనేది కీలకం. బ్లాక్‌ బాక్స్‌లను విమానాలు, హెలికాఫ్టర్లలో వాడుతుంటారు. ఇవి రెండు భాగాలుగా ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్‌, మరొకటి కాక్‌ పిట్ వాయిస్‌ రికార్డర్‌(సీవీఆర్‌). బ్లాక్ బాక్సుల ద్వారా సిబ్బంది పనితీరును, ప్రమాదానికి గల కారణాలపై ఓ నిర్ణయానికి రావడానికి ఆస్కారం లభిస్తుంది. మానవ తప్పిదాలు, సాంకేతిక లోపాలు ఏవి ప్రమాదానికి కారణమో తెలుసుకోవడానికి ఈ వీడియో లేక వాయిస్‌ రికార్డింగ్‌ వ్యవస్థలు ఉపయోగపడతాయి.

ఇప్పుడు ఈ బ్లాక్‌ బాక్స్‌ను విమానాల్లో మాదిరిగా రైళ్లలోనూ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.. భారత రైల్వే శాఖ రైళ్లలో లోకో క్యాబ్‌ వాయిస్ రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవలికాలంలో తరచుగా రైలు ప్రమాదాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైలు ప్రమాదాలకు కారణాలు రాబట్టడం కష్టతరంగా మారింది. ఇందుకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్న రైల్వే అధికారులు విమానాల మాదిగా బ్లాక్ బాక్సులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

విచారణ సమయంలో వాటి ద్వారా ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు, సిబ్బంది పనితీరును అంచనా వేయడం సులభమవుతుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉన్నట్టు పేర్కొన్న రైల్వే అధికారులు, ఈ ప్రాజెక్టు పూర్తయితే దశల వారీగా అన్ని రైళ్లలో ఉపయోగిస్తామంటున్నారు. .

Exit mobile version