Site icon TeluguMirchi.com

‘భారత్ బంద్’లో అపశృతి


ఇవాళ చేపట్టిన ‘భారత్ బంద్’లో అపశృతి చోటుచేసుకుంది. బీహార్‌లోని జహనాబాద్‌లో జరిగిన ఒక సంఘటనలో ఆస్పత్రికి తరలిస్తున్న ఓ బాలిక ట్రాఫిక్‌లో చిక్కుకుని రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయింది. భారత్ బంద్‌లో పాల్గొన్న ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించడంతో జహనాబాద్‌లో ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

భారత్ బంద్ కారణంగా ఇవాళ తనకు ఒక్క వాహనం కూడా లభించలేదని, ఎలాగోలా ఒక ఆటో రిక్షా తీసుకుని అందులో తన కూతురిని జహనాబాద్ తీసుకెళ్లేందుకు యత్నించినప్పటికీ, అప్పటికే ఆలస్యమైన కారణంగా తన కూతురు రోడ్డుపైనే ప్రాణాలు విడిచిందని ఆ చిన్నారి తండ్రి మాంఝి బోరుమన్నాడు. జహనాబాద్ చేరుకోవడానికి కేవలం 1 గంట మాత్రమే పడుతుంది కానీ ఇవాళ మూడు గంటలైనా అక్కడకు చేరుకోలేకపోయానని మాంఝి ఆవేదన వ్యక్తంచేశాడు.

పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ప్రతిపక్ష పార్టీలు భారత్ బంద్ చేపట్టడంపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘చిన్నారి చనిపోయిన ఘటనకు రాహుల్ బాధ్యత వహిస్తారా?’’ అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చేపట్టిన భారత్ బంద్ విఫలం అయ్యిందనీ, కాంగ్రెస్ పార్టీ దేశంలో ‘‘భయోత్పాతం సృష్టిస్తోందని’’ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.

మరోవైపు భారత్ బంద్ కారణంగా పాప మృతిచెందినట్టు వస్తున్న వార్తలను బీహార్ అధికారులు ఖండించారు. ట్రాఫిక్ జామ్ కారణంగా పాప ప్రాణాలు కోల్పోలేదని జాహనాబాద్‌ సబ్‌డివిజినల్ అధికారి పరితోశ్ కుమార్ పేర్కొన్నారు. చిన్నారి తీసుకునే బయల్దేరే సమయానికే తీవ్ర జాప్యం జరిగినట్టు గుర్తించామన్నారు.

Exit mobile version